ఎస్వీ సతీష్ రెడ్డి…పులివెందులలో జగన్‌పై పోటీ చేసే దమ్ము, ధైర్యం టీడీపీలో ఎవరికి లేని టైమ్‌లో ఈ సీనియర్ నేత వైయస్ ఫ్యామిలీకి ఎదురొడ్డి నిలిచారు. పలుమార్లు జగన్ చేతిలో ఓటమి పాలైనా..పులివెందులలో టీడీపీ వాయిస్ బలంగా వినిపించిన నేత..సతీష్ రెడ్డి. అందుకే చంద్రబాబు గత ప్రభుత్వంలో సతీష్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవితో పాటు శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి కూడా కట్టబెట్టాడు. అయితే గత కొంత కాలంగా పార్టీలో నారాలోకేష్ పెత్తనంపై సతీష్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సొంత పార్టీలో సీనియర్ అయిన తనను కాదని లోకేష్ బీటెక్ రవికి ప్రాధాన్యత ఇవ్వడంపై సతీష్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అంతే కాదు బీటెక్ రవికి ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టి తనను పక్కన పెట్టడంపై సతీష్ రెడ్డి రగిలిపోతున్నారు.
ఇక రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా…చంద్రబాబు, లోకేష్‌లతో సహా టీడీపీ నేతలు పదే పదే రాయలసీమ గూండాలు, పులివెందుల రౌడీలంటూ తమ ప్రాంతం ప్రజలను కించపర్చడంపై సతీష్ రెడ్డి మనోవేదనకు గురయ్యారు. పులివెందుల రౌడీలు అంటూ చేస్తున్న వ్యాఖ్యలతో తాము ఎంతో ఇబ్బందిపడుతున్నామని…సతీష్ రెడ్డితో సహా స్థానిక నాయకులు టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా..ఫలితం లేకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. పైగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఘటన తర్వాత చంద్రబాబు, లోకేష్‌లతో సహా టీడీపీ నేతలు పులివెందుల రౌడీలంటూ నోరుపారేసుకోవడంపై సతీష్ రెడ్డి ఆవేదన చెందుతున్నారు. అంతే కాదు రాయలసీమ ముఠాదారులు లుంగీలు కట్టుకుని వచ్చి విశాఖలో భూకబ్జాలు చేస్తారంటూ టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై సతీష్ రెడ్డి మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో పార్టీలో ఇంకా కొనసాగటంలో అర్థం లేదని సతీష్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. కాగా జమ్మలమడుగు టీడీపీ కీలక నేత, మాజీమంత్రి రామసుబ్బారెడ్డితో పాటు త్వరలో సతీష్ రెడ్డి కూడా జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం ఖాయమని ఆయన అనుచరులు చెబుతున్నారు. అంతేకాదు తమను పులివెందుల రౌడీలు, కడప గూండాలంటూ పదే పదే అవమానిస్తున్న చంద్రబాబు, లోకేష్, ఇతర టీడీపీ నేతలకు వైసీపీలో చేరిన తర్వాత చుక్కలు చూపించాలని సతీష్ రెడ్డి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మొత్తంగా రామసుబ్బారెడ్డి, పాలకొండ్రాయుడు, సతీష్ రెడ్డి వంటి కీలక నేతలు రాజీనామా బాట పట్టడం కడప జిల్లా టీడీపీ శ్రేణులకు షాకింగ్‌గా మారింది.