ఏపీ నుంచి రాజ్యసభ ఎంపీ అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేశారు. విధేయతే ప్రామాణికంగా పెద్దల సభకు నలుగురు నేతలను ఎంపిక చేశారు. ఊహించిన విధంగానే ప్రస్తుత కేబినెట్లోని ఇద్దరు మంత్రులైన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు పంపాలని సీఎం నిర్ణయించారు. పిల్లిసుభాష్ చంద్రబోస్, మోపిదేవిలకు వైయస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు.. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకువచ్చినప్పుడు జగన్‌కు మోపిదేవి, పిల్లి సుభాష్‌లు అండగా నిలిచారు. అందుకే వారిద్దరు గత ఎన్నికల్లో ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి తన కేబినెట్లో అవకాశం ఇచ్చారు. పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు ఏకంగా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించారు. అయితే వికేంద్రీరణపై టీడీపీ చేసిన కుట్రలపై ఆగ్రహించిన జగన్ ఏకంగా శాసనమండలిని రద్దు చేశారు. ఈ సందర్భంగా పిల్లి, మోపిదేవిలకు రాజకీయంగా మరింత ఉన్నత పదవులు ఇస్తామని జగన్ భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు జగన్ వారిద్దరిని రాజ్యసభకు పంపుతున్నారు.
ఇక మూడో స్థానంలో మొదటి నుంచి తనతో పాటు ఉంటూ..పార్టీకి అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తున్న అయోధ్య రామిరెడ్డికి అవకాశం కల్పించారు. అలాగే నాలుగో స్థానం నుంచి రిలయన్స్ అధినేత అంబానీ రిక్వెస్ట్ మేరకు ముంబైకి చెందిన వ్యాపారవేత్త పరిమళ్ నత్వాని పేరును సీఎం జగన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ స్వయంగా సీఎం జగన్ ఇంటికి వచ్చి నత్వానికి సీటు ఇవ్వాల్సిందిగా కోరారు. రాష్ట్రానికి భవిష్యత్తు అవసరాలను దృష్ట్యా జగన్ కూడా నత్వానికి సీటు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. కాగా వైసీపీ నుంచి ముగ్గురికి, స్వతంత్ర్య అభ్యర్థిగా నత్వానినికి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఒక నత్వాని సీటు మినహా…మిగిలిన మూడు సీట్లలో సీఎం జగన్ విధేయతకు పెద్ద పీట వేసి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ వంటి బీసీ మంత్రులకు రాజ్యసభ ఎంపీలుగా అవకాశం ఇవ్వడం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీకి అసెంబ్లీలో 151 సీట్ల ఫుల్ మెజారిటీ ఉండడంతో నలుగురు రాజ్యసభ అభ్యర్థులు ఈజీగా గెలిచే అవకాశం ఉంది. మొత్తంగా సీఎం జగన్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడంపై రాజకీయ, మీడియా వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.