స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక కిందా మీదా పడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. కడప జిల్లాలో టీడీపీ కీలక నేత రామసుబ్బారెడ్డితో మరో కీలక నేత పాలకొండ్రాయుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. 2014 ఎన్నికలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రామసుబ్బారెడ్డి, వైసీపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే ఎన్నికలు కాగానే చంద్రబాబు ఆదినారాయణ రెడ్డిని ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకుని ఏకంగా మంత్రి పదవిని కట్టబెట్టాడు. దశాబ్దాలుగా రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి వర్గాల మధ్య ఫ్యాక్షన్ తగాదాలు ఉన్నాయి. దీంతో ఆది చేరికను రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే చంద్రబాబు సర్దిచెప్పి రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టాడు. అంతే కాదు జిల్లాలో వచ్చే అక్రమ సంపాదనలో 50-50 శాతం పంచుకోమని సెటిల్‌మెంట్ చేశాడు.
కాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డిని కడప ఎంపీగా పోటీ చేయించిన చంద్రబాబు రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు కాని ఆయన వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవడంతో ఆదినారాయణరెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీలో చేరారు. ఇక గత కొద్ది నెలలుగా రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరుతారంటూ వార్తలు వస్తున్నా చంద్రబాబు బుజ్జగిస్తూ వచ్చారు. ఒకనొక సందర్భంలో ఎయిర్ పోర్ట్‌లో తనకు ఎదురైన సీఎం జగన్‌ను రామసుబ్బారెడ్డి ఆత్మీయంగా పలకరించారు. దీంతో రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడం ఖాయమని జిల్లాలో చర్చ జరిగింది. కాని అది ఫలించలేదు.
అయితే తాజాగా రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడం దాదాపుగా ఖాయమైంది. ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన రామసుబ్బారెడ్డిని వైసీపీలో చేర్చుకోవడం ద్వారా కడప జిల్లాలో ఆదినారాయణరెడ్డికి చెక్ పెట్టాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. ఈ మేరకు పార్టీలో చేరితే సముచిత ప్రాధాన్యం ఉంటుందని సంకేతాలు పంపించింది. ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా అనుచరులతో చర్చించిన రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఇక కడప జిల్లా టీడీపీలో ముఖ్య నేతగా ఉన్న పాలకొండ్రాయుడు సైతం వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. రాయచోటి నుంచి గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత పాలకొండ్రాయుడుని వైసీపీలోకి తీసుకువచ్చేందుకు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే గడికోట మంతనాలు చేస్తున్నారు. పాలకొండ్రాయుడు కూడా వైసీపీలో చేరేందుకు సముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే సీఎం జగన్ సమక్షంలో వందలాది మంది అనుచరులతో రామసుబ్బారెడ్డి, పాలకొండ్రాయుడు వైసీపీలో చేరడం ఖాయమైంది. మొత్తంగా ఇద్దరు కీలక నేతలు పార్టీని వీడడంతో కడప జిల్లాలో టీడీపీ ఖాళీ అయింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రామసుబ్బారెడ్డి లాంటి కీలక నేత వైసీపీ కండువా కప్పుకోవడం చంద్రబాబుకు షాకింగ్‌గా మారింది.