టీడీపీ మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్‌రావు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మార్చి 9 వ తేదీ ఉదయం టీడీపీకి డొక్కామాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఓ బహిరంగ లేఖ రాసి పార్టీని వీడడానికి గల కారణాలను వివరించారు. కావాలనే చంద్రబాబు తనకు ఓడిపోయే ప్రత్తిపాడు సీటు ఇచ్చారని డొక్కా ఆరోపించారు. శాసనసభకు, శాసనమండలికి మధ్య వివాదం తలెత్తి ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడుతుందనే భయంతోనే శాసనమండలి సమావేశాలకు హాజరు కాకుండా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన వివరించారు. అయితే రాజధాని రైతుల జేఏసీ పేరుతో టీడీపీ నేతలు తనపై చేసిన అవినీతి ఆరోపణలు ఎంతో బాధ కలిగించాయని అందుకే పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. తాను వైసీపీకి దగ్గరయ్యానని చెప్పిన డొక్కా..ఆ పార్టీలో చేరికపై ఎవరితోను చర్చించలేదని తన లేఖలో పేర్కొన్నారు.
కాగా తన రాజీనామాపై తీవ్ర విమర్శలు చెలరేగడంతో ఆయన కొద్ది గంటల వ్యవధిలోనే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో కలిసి తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన డొక్కా వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్ మాణిక్యవరప్రసాద్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని, స్వయంగా వైసీపీ కండువా కప్పి సాదరంగా స్వాగతించారు. ఇక నుంచి పార్టీ కోసం పని చేయాలని సీఎం జగన్ డొక్కాకు సూచించారు. ఈ సందర్భంగా డొక్కా వర ప్రసాద్ మాట్లాడుతూ.. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికే వైఎస్సార్‌సీపీలో చేరానని ప్రకటించారు. మూడు రాజధానులతో సహా సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలను తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. 2014లోనే వైఎస్సార్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని, కానీ అనుకోని కారణాల వల్ల టీడీపీలో చేరాల్సి వచ్చిందన్న డొక్కా తనకు ఆ పార్టీలో సరైన గౌరవం లభించలేదని, కాలం కలసిరాలేదని వాపోయారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా వ్యవహారంలో టీడీపీ నేతలు చేసిన విమర్శలు తనను తీవ్రంగా కలచివేశాయని అందుకే గౌరవం లేని చోట ఉండకూడదనే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు డొక్కా మాణిక్యవరప్రసాద్‌రావు తెలిపారు. మొత్తంగా కొద్ది గంటల వ్యవధిలోనే టీడీపీకి రాజీనామా చేసి, ఏకంగా సీఎం జగన్ సమక్షంలో డొక్కా మాఱిక్యవరప్రసాద్ వైసీపీలో చేరడం చంద్రబాబుతో సహా టీడీపీ శ్రేణులకు షాకింగ్‌గా మారింది.