వాట్సాప్.. అసలు ఈ ఫీచర్ లేని జీవితం ఊహించుకోలేమేమో.. అలాంటి వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్ వచ్చేసింది. కొన్ని నెలలుగా ఊరిస్తున్న ‘డార్క్‌మోడ్’ ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. రాత్రివేళల్లో వాట్సాప్‌ను ఉపయోగించేవారి కళ్లకు శ్రమ కలగకుండా ఉండేందుకు ఈ ఫీచర్ తీసుకొచ్చింది. ఈవారం మొదట్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫీచర్ అందుబాటులోకి రాగా నేటినుంచి మనదేశంలోని యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా 40కోట్ల మంది వాట్సాప్ యూజర్లు డార్క్‌మోడ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోనున్నారు. అయితే, ఆండ్రాయిడ్ 10, ఐవోఎస్ 13లలో మాత్రమే ఈఫీచర్ పనిచేస్తుంది. డార్క్ గ్రే కలర్ బ్యాక్ గ్రౌండ్‌తో ఉన్న ఈసరికొత్త ఫీచర్ వల్ల రాత్రివేళ తక్కువ లైటింగ్ వస్తుంది. ఇంటర్నెట్లోని సమాచారం సాధారణంగా తెల్లని బ్యాక్ గ్రౌండ్‌పై నల్లని అక్షరాల రూపంలో ఉంటుంది. దీనివల్ల కళ్లకు శ్రమ కలుగుతుంది. ఇప్పుడు వాట్సాప్ అందుబాటులోకి తెచ్చిన డార్క్ మోడ్ వల్ల బ్యాక్‌గ్రౌండ్ నల్లగా ఉండి, అక్షరాలు తెల్లగా ఉంటాయి. ఫలితంగా కళ్లు ఎక్కువ ఒత్తిడికి గురికావు. రాత్రివేళ వాట్సాప్‌ను ఉపయోగించే వారికి సౌకర్యంగా ఉంటుందని వాట్సాప్ పేర్కొంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకునేందుకు యూజర్లు తొలుత సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ కనిపించే చాట్‌పై క్లిక్ చేస్తే థీమ్ అని కనిపిస్తుంది. అందులో లైట్, డార్క్ అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. డార్క్ మోడ్‌ను సెలక్ట్ చేసుకోవడంద్వారా దీనిని ఉపయోగించుకోవచ్చు. రాత్రి సమయాల్లో వాట్సాప్ వినియోగించేవారు దీనిద్వారా కాస్త ఉపశమనం పొందే అవకాశముంది.