దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్యోదంతంలో ప్రధాన నిందితుడు అయిన మారుతీరావు హైదరాబాద్‌లో అనుమానాస్పదరీతిలో మృతి చెందారు. రెండేళ్ల క్రితం కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకుందనే ఆగ్రహంతో..కిరాయి హంతక ముఠాతో అల్లుడు ప్రణయ్ ను మారుతిరావు దారుణంగా హత్య చేయించాడు. ఈ పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇటీవల పీడీ యాక్ట్ కేసులో ఆరు నెలల క్రితం విడుదల అయిన మారుతీరావు అప్పటి నుంచి కూతురు అమృతకు ఇంటికి రమ్మని వేధించడం మొదలుపెట్టాడు. ప్రణయ్ హత్య కేసులో అనుకూలంగా సాక్షం చెబితే ఆస్తి అంతా తన పేరున రాస్తానని మధ్యవర్తులతో అమృతకు రాయబారం పంపాడు. అయినా కూతురు అమృత ససేమిరా అనడంతో మారుతిరావు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కాగా కొద్ది రోజుల క్రితం మిర్యాలగూడలోని మారుతీరావుకు చెందిన ఖాళీ స్థలంలోని ఓ షెడ్లో గుర్తు తెలియని శవం లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మారుతీరావును ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో కూతురు ఎంత చెప్పినా…తన ఇంటికి రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన మారుతీరావు హైదరాబాద్‌కు వచ్చాడు. ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్యభవన్‌లో నిన్న రాత్రి రెండురోజులకోసమని రూమ్ తీసుకున్నాడు. ఈ రోజు ఉదయం అనుమానాస్పదరీతిలో మృతి చెందిన మారుతీరావును సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు డెడ్‌బాడీని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మారుతీరావు పాయిజన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతో పరువు పోయిందనే కోపంతో అల్లుడు ప్రణయ్‌ను క్రూరంగా చంపించిన మారుతీరావు జీవితం చివరకు విషాదంతంగా ముగిసింది. మారుతీరావు ఆత్మహత్యతో ప్రణయ్ఇంటి ముందు పోలీసులు భద్రత పెంచారు.
