ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని గ్రామాల రైతులతో గత 80 రోజులుగా అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేయడాన్ని చంద్రబాబు సహించలేకపోతున్నాడు. అందుకే ఎల్లోమీడియాతో కలిసి విశాఖ, కర్నూలుపై పదేపదే విషం కక్కుతున్నాడు. దీంతో ఆగ్రహించిన ఉత్తరాంధ్ర ప్రజలు ప్రజా చైతన్యయాత్ర పేరుతో విశాఖలో అడుగుపెట్టాలని చూసిన చంద్రబాబును ఎయిర్‌పోర్ట్‌లో అడ్డుకుని చెప్పులు, టమాటాలు, గుడ్లతో కొట్టి తరిమికొట్టారు.
ఇక స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు డబుల్ గేమ్ ఆడుతున్నాడు. జగన్ సర్కార్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లను 59 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రబాబు తన పార్టీ నేత బిర్రు ప్రతాపరెడ్డితో హైకోర్టులో కేసు వేయించాడు. దీంతో కోర్టు 50 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుకు లోబడి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుంటే.. బిర్రు ప్రతాపరెడ్డి వైసీపీ నేత అంటూ, కోర్ట్ తీర్పుతో 24 శాతమే బీసీలకు దక్కుతున్నాయని…గతంలో జగన్ బీసీలకు ఇస్తానన్న 34 శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయంటూ చంద్రబాబు కుటిల రాజకీయం చేస్తున్నాడు. దీంతో సీఎం జగన్ జనరల్ కేటగిరిలో మరో పది శాతం బీసీలకు కేటాయిస్తూ నిర్ణయించడంతో చంద్రబాబుకు, టీడీపీ నేతల నోర్లు మూతపడ్డాయి. కాగా రాజధానిపై, బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు చేస్తున్న కుట్రలపై మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు.
తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. రెండున్నర లక్షల కోట్ల అప్పులతో పాటు 66 వేల కోట్ల పెండింగ్ బిల్లులను కొత్త ప్రభుత్వానికి చంద్రబాబు ఇచ్చారని మండిపడ్డారు. ఏపీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కూడా సీఎం జగన్ పలు సంక్షేమ పథకాలు అమలు చేయడం పట్ల కన్నబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నదే సీఎం జగన్ తపనని ఆయన తెలిపారు. బీసీ రేజర్వేషన్లను చంద్రబాబు కుట్రపూరితంగా అడ్డుకుంటే.. పార్టీ పరంగా బీసీలకు అదనంగా పదిశాతం రిజర్వేషన్లు ఇవ్వబోతున్నామని చెప్పారు. ఇక రాజధాని అంశంపై మాట్లాడుతూ…కేవలం తన కులం కోసమే విశాఖపై చంద్రబాబు విషం చిమ్ముతున్నారని కన్నబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే తపనతో సీఎం జగన్ మూడు రాజధానులు ఏర్పాటుకు ప్రయత్నిస్తుంటే.. చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తన సామాజిక వర్గానికి మేలు చేయడానికి అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తోన్న కుట్రలను తిప్పికొట్టాలని మంత్రి కన్నబాబు పిలుపునిచ్చారు. మొత్తంగా చంద్రబాబు కుటిల రాజకీయంపై వైసీపీ మంత్రి కురసాల కన్నబాబు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.