సింహాచలం దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(మాన్సాస్) ట్రస్ట్ చైర్మన్‌గా విజయనగరం రాజా వారసులు, ఆనంద గజపతి రాజు కుమార్తె సంచితా గజపతిరాజును నియమిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంచితా గజపతి రాజు మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి…తనకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.. అయితే మాన్సాస్ ట్రస్ట్ పరిణామాలపై టీడీపీ మాజీ ఎంపీ అశోక్ గజపతి రాజు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంచితా గజపతి రాజు హిందువు కాదని, క్రిస్టియన్ అంటూ, చీకటి జీవోలతో ఛైర్మన్ పదవి దక్కించుకుందంటూ.. అశోక్ గజపతిరాజుతో పాటు టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
తనపై తన బాబాయి అశోక్ గజపతిరాజు చేస్తున్న విమర్శలపై సంచయిత గజపతిరాజు స్పందించారు. బాబాయ్ ఇలా మాట్లాడతారని అస్సలు ఊహించలేదని కంటతడి పెట్టారు. వాటికన్ సిటీలో ఫొటో దిగితే తనను క్రిస్టియన్ అంటారా అంటూ సంచయిత మండిపడ్డారు. అశోక్ గజపతిరాజు ఎప్పుడూ చర్చిలకు, మసీదులకు వెళ్లలేదా? అని ఆమె ప్రశ్నించారు. ఇక చీకటి జీవోతో తాను పదవి దక్కించుకున్నానని టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను సంచయిత తోసిపుచ్చారు. చట్టబద్ధంగా తాను ట్రస్ట్ చైర్‌పర్సన్ అయ్యానని ఆమె స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు హయాంలో అశోక్‌గజపతి కుమార్తె అదితి విజయలక్ష్మిని ట్రస్ట్ సభ్యురాలిగా నియమించి తనను విస్మరించారని సంచయిత వాపోయారు. ఆ రోజు తనను ఎందుకు పక్కనపెట్టారని ప్రశ్నించారు.
కాగా సంచయిత నియామకంపై పెద్దమనిషిగా పేరొందిన అశోక్ గజపతి రాజు చేస్తున్న చిల్లర రాజకీయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2016 ఏప్రిల్‌లో మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం పూర్తిగా చంద్రబాబు చేతిలోకి వెళ్లిపోయింది. 2017 ఏప్రిల్ 27న జీవో నంబర్ 155 ద్వారా అశోక్‌గజపతి కుమార్తె అదితి విజయలక్ష్మిని కూడా బోర్డు సభ్యురాలిగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు. అయితే అప్పుడు పూసపాటి వారసురాలైన ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయితను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. కేవలం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తమ ఇష్టానుసారం గా వ్యవహరించారు. అయితే ఇప్పుడు మాత్రం చీకటి జీవోల ద్వారా సంచయితను ఛైర్మన్‌గా చేశారని టీడీపీ రాజకీయం చేస్తోంది. కేవలం మాన్సాస్ ట్రస్ట్ తన అన్న కుటుంబం చేతిలోకి వెళ్లిపోయిందనే దుగ్ధతోనే సంచయిత హిందువు కాదని క్రిస్టియన్ అంటూ అశోక్ గజపతిరాజు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. మొత్తంగా మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ నియామకం వ్యవహారంలో తన చిల్లర రాజకీయంతో అశోక్ గజపతి రాజు తన పెద్దరికాన్ని, హుందాతనాన్ని పోగొట్టుకున్నాడనే చెప్పాలి.