కేంద్రం నుంచి రాష్ట్రానికి జీఎస్టీ బకాయిలు రావడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. జీఎస్టీ విషయంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నానని సీఎం చెప్పారు. శాసనసభ సమావేశాల్లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై విస్తృతంగా చర్చ జరగాలని సీఎం తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.
ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజం. పౌరసత్వ సవరణ చట్టం దేశాన్ని కుదిపేస్తోంది. సీఏఏపై చర్చ ఒకరోజుతో అయ్యేది కాదు. సీఏఏపై చర్చ అంటే అంతర్జాతీయ స్థాయిలో దేశభవిష్యత్ గురించి మాట్లాడటమే. బీజేపీ ఎమ్మెల్యే కూడా తన వాదన వినిపించవచ్చు. సీఏఏపై అందరి సభ్యులకు అవకాశం కల్పించాలని స్పీకర్‌ను కోరుతున్నా. సీఏఏపై ఎవరి అభిప్రాయం వారు వెల్లడించొచ్చు. సీఏఏ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా సవివరంగా మాట్లాడొచ్చు. సీఏఏ చాలా కీలకమైన అంశం, దీనిపై పూర్తిస్థాయిలో చర్చ జరగాలన్నారు.
సీఏఏపై అన్ని పార్టీల వారికి అవకాశం ఇస్తాం. ఎన్పీఆర్, సీఏఏ విషయంలో ఏ పార్టీకి ఉండే అభిప్రాయాలు ఆ పార్టీకి ఉంటాయి. సీఏఏపై మేం ఇప్పటికే పార్లమెంట్‌లో వ్యతిరేకించాం. దేశవ్యాప్తంగా ఐదారు అసెంబ్లీల్లో చర్చ జరిగింది. రాష్ట్రాల అభిప్రాయాన్ని కేంద్రం అంగీకరిస్తుందా లేదా అన్నది తర్వాత చూడాలి. 40-50 మంది చనిపోయిన సీరియస్ అంశంపై కచ్చితంగా చర్చ జరగాలి. మన మనోభావాలు కేంద్రానికి తెలియజేయాలి. సభలో ఎవరు ఏం చెప్పినా విందాం..తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపేటప్పుడు చర్చ పెడతామన్నారు. సీఏఏపై దేశంలో ఉద్విగ్న వాతావరణం ఉంది. సీఏఏపై జరిగే చర్చ ఒక రోజుతో అయ్యేది కాదు. అంతర్జాతీయ స్థాయిలో మన దేశ మంచి చెడ్డలు ఆధారపడి ఉన్నాయి. వచ్చే తరాలపై పడే ప్రభావాన్ని మనమంతా చర్చించాలి. సీఏఏపై రెండు మూడు గంటలైనా సభలో చర్చిద్దాం. సభ అంతిమ ఉద్దేశాన్ని కేంద్రానికి తెలియజేద్దాం. సీఏఏపై సభలో మాట్లాడాలని కేబినెట్‌లో ఇంతకు ముందే తీర్మానం చేసిశామని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు.