పేదలకు వచ్చే నాలుగేళ్లలో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన 30 లక్షల ఇళ్ల డిజైన్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. బెడ్రూం, కిచెన్,పెద్ద హాలు, వరండా, టాయిలెట్ సదుపాయాలతో ఇళ్లను నిర్మించడానికి సమాయత్తం అమవుతోంది. గృహనిర్మాణంపై సమీక్ష సందర్భంగా పేదలకు కట్టించనున్న ఇంటి డిజైన్‌పై ముఖ్యమంత్రి వైయస్.జగన్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. తాము రూపొందించిన డిజైన్లను ముఖ్యమంత్రి ముందు ఉంచారు. పేదలకు నిర్మించి ఇచ్చే ఇళ్లునాణ్యంగా, ఆకర్షణీయంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇంటి డిజైన్‌లో ఏం ఇవ్వబోతున్నామో అడిగి తెలుసుకున్నారు. బెడ్రూం, కిచెన్, హాలు, వరండా, టాయిలెట్‌ను డిజైన్‌లో పొందుపరిచామని అధికారులు తెలిపారు. గాలి, వెలుతురు ధారాళంగా ఉండేలా డిజైన్ రూపకల్పనలో జాగ్రత్తలు పాటించామన్నారు. వీటికి సీఎం కొన్ని మార్పులు, చేర్పులు సూచించారు. నాణ్యత విషయంలో రాజీపడరాదని స్పష్టం చేశారు. సంవత్సరానికో 6.5 లక్షల ఇళ్ల చొప్పున నిర్మించడానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. ఈ ఇళ్ల నిర్మాణం ద్వారా ఏర్పాటవుతున్న కాలనీల్లో పచ్చదనం, పరిశుభ్రత, కరెంటు సౌకర్యం లాంటి కనీస వసతుల ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టిసారించింది. కాలనీలన్నీ మార్గదర్శకంగా ఉండేలా చర్యలను తీసుకుంటున్నారు.
