అనంతపురం జిల్లాలో ప్రజాదరణ పొందిన నేతల్లో ఉరవకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ముందు వరుసలో ఉంటారు. అంతులేని ప్రజాభిమానం ఆయన సొంతం. వైయస్ కుటుంబానికి విశ్వేశ్వరరెడ్డి అత్యంత ఆత్మీయుడు. . 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు ఎంతగా ప్రలోభాలకు గురి చేసినా…విశ్వేశ్వరరెడ్డి లొంగలేదు. వైసీపీలోనే ఉండిపోయారు. అందుకే సీఎం జగన్‌తో పాటు విజయమ్మ కూడా నమ్మినబంటు అయిన విశ్వేశ్వరరెడ్డిని ఎంతో అభిమానిస్తారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పయ్యావుల కేశవ్ వరుసగా రెండు సార్లు ఓడిపోయాడనే సింపతీ వర్కవుట్ అవడంతో విశ్వేశ్వరరెడ్డి అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. కాని సొంత పార్టీలోని అసమ్మతి వర్గాలే ఆయన ఓటమికి కారణమయ్యాయని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. కాగా ఓటమి తర్వాత కూడా విశ్వేశ్వరరెడ్డి ఆయన నిత్యం ప్రజల్లోనే ఉంటూ…ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్నారు.
తాజాగా విశ్వేశ్వరరెడ్డికి జరిగిన ఓ చిన్న ఘటన..అనంతపురం జిల్లా ప్రజలు, వైసీపీ శ్రేణులు ఆయన్ని ఎంతగా అభిమానిస్తారో తెలియజేసింది అనంతపురం శ్రీ సెవెన్ ఫంక్షన్ హాల్‌లో వైసీపీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి లిఫ్టులో ఇరుక్కుపోయారు. ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యకర్తల మీటింగ్‌లో పాల్గొన్న ఆయన.. సమావేశం అనంతరం కిందకు వెళ్తుండగా.. లిఫ్టు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో విశ్వేశ్వర రెడ్డి లిఫ్ట్‌లో ఇరుక్కున్నారు. దీంతో ఆయనకు ప్రమాదం ఏదైనా జరుగుతుందనే ఆందోళనతో అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. దాదాపు గంటసేపు శ్రమించిన తర్వాత పోలీసులు, కార్యకర్తలు లిఫ్టును ధ్వంసం చేసి విశ్వేశ్వరరెడ్డిని బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తమ అభిమాన నేత క్షేమంగా బయటకు రావడంతో కార్యకర్తలు ఒక్కసారిగా ఆయన్ని చుట్టుముట్టి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు అభిమానులు తమ నాయకుడిని చూసి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. జై విశ్వేశ్వరరెడ్డి అంటూ ఆ ప్రాంతం నినాదాలతో మారుమోగిపోయింది. పోలీసులు ఆయన్ని క్షేమంగా అక్కడ నుంచి తరలించారు. మొత్తంగా ఉరవకొండ వైసీపీ సీనియర్ నేత విశ్వేశ్వరరెడ్డికి పెనుముప్పు తప్పడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.