ఏపీలో అధికార వైసీపీ. ప్రతిపక్ష టీడీపీకి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ముఖ్యంగా గత రెండున్నర నెలలుగా అమరావతి ఆందోళనల నేపథ్యంలో రాజధాని రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఇక వైజాగ్ ఎయిర్‌పోర్ట్ వద్ద చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకోవడంతో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు వైసీపీ కార్యకర్తలపై దాడి చేశారు. రీసెంట్‌గా ప్రజా చైతన్యయాత్రలో భాగంగా తూగో జిల్లాలో పర్యటించిన లోకేష్‌ను పురుషోత్తమపట్నం ఎత్తిపోతల నిర్వాసితులైన రైతులు, వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో మరోసారి టీడీపీ కార్యకర్తలు రైతులు, వైసీపీ కార్యకర్తలపై మూకుమ్మడిగా దాడి చేశారు. అయితే తాజాగా ఇదే ప్రజాచైతన్యయాత్రలో వైసీపీ ఎమ్మెల్యేకు తెలుగు తమ్ముళ్లు జై కొట్టిన ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కులం, చూడం, మతం చూడం, పార్టీని చూడం, మానవత్వమే మా మతం అని చెప్పే సీఎం జగన్ స్ఫూర్తిగా వైసీపీ నాయకులు రాజకీయాలకు అతీతంగా సాటి మనిషిని ప్రేమిస్తున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు.
తాజాగా చిత్తూరు జిల్లా వి.కోటలో టీడీపీ మాజీ మంత్రి అమరనాథ రెడ్డి చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు వచ్చిన ఆ పార్టీ కార్యకర్త ఓబుల్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. అదే మార్గంలో వెళుతున్న పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఇది చూసిన వెంటనే స్పందించారు. ఓబుల్ రెడ్డిని కూర్చోబెట్టి, అతనికి ధైర్యం చెప్పి, వెంటనే స్ట్రెచర్ మీద ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు…పగోడు అయినా.. ఆపదలో ఉంటే ఆదుకునే గుణం సీమ ప్రజల రక్తంలోనే ఉంది. అంతకు మించి శత్రువైనా శరణుకోరితే ఇంటికి పిలిచి అన్నంపెట్టి ఆత్మీయంగా ఆదరించే సంస్కృతి సీమ ప్రజలది. అందుకే ప్రత్యర్థి పార్టీకి చెందిన కార్యకర్త రోడ్డు ప్రమాదంలో గాయపడితే వైసీపీ ఎమ్మెల్యే రాజకీయం చూడలేదు..సాటి మనిషిగా స్పందించి శతగాత్రుడిని వెంటనే ఆసుపత్రికి తరలించి అతడి ప్రాణాలు కాపాడారు. కాగా ప్రజా చైతన్యయాత్రలో గాయపడిన తమ కార్యకర్త ప్రాణాలు కాపాడిన వైసీపీ ఎమ్మెల్యే వెంకటేగౌడ మానవత్వానికి తెలుగు తమ్ముళ్లు జేజేలు పలుకుతున్నారు. హ్యాట్సాఫ్ వెంకటే గౌడ.