యూటర్న్‌ల చంద్రబాబు మరో బిగ్ యూటర్న్‌కు సిద్ధమవుతున్నాడు..ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మళ్లీ పదేళ్ల తర్వాత పాత మిత్రులతో పొత్తుకు సిద్ధమవుతోంది. ఏపీలో పూర్తిగా ఉనికి కోల్పోయిన ఎర్ర పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నాడు. అసలు చంద్రబాబు ఏ ఎన్నికలైనా సరే పొత్తులు లేకుండా ఒంటరిగా వెళ్లే ధైర్యం చేయడు..గతంలో 1999లో, 2004లో, 2009లో, 2014లో చంద్రబాబు పొత్తులతో ఎన్నికలకు వెళ్లాడు. 1999లో ఎన్డీయేతో పొత్తు పెట్టుకుని మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2004లో మళ్లీ ఎన్డీయేతోనే ఎన్నికలకు వెళ్లాడు. అయితే ఆ ఎన్నికల్లో వైయస్ దెబ్బకు చంద్రబాబు పొత్తు మంత్రం పని చేయలేదు. దీంతో 2009లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, తెలంగాణలో టీఆర్ఎస్‌తో కలిసి మహా కూటమిగా ఎన్నికల్లో పోటీ చేశాడు. మళ్లీ మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకునేది లేదని, మోదీని హైదరాబాద్‌లో అడుగుపెట్టనిచ్చేది లేదని బాబు హూంకరించాడు. అయినా మరోసారి వైయస్ హవా ముందు కూటమి చిత్తయింది.
ఇక 2014లో దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తుండడంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఆఖరకు పవన్ కల్యాణ్ క్రేజ్ గమనించి, అప్పుడే పుట్టిన పార్టీ కాని పార్టీ అయిన జనసేనతో కూడా పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాడు. మోదీ, పవన్ కల్యాణ్‌ల ఫ్యాక్టర్‌తో చంద్రబాబు గట్టెక్కి అధికారంలోకి వచ్చాడు. అయితే 2019లో మాత్రం చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలకు వెళదామని వ్యూహం పన్నాడు. ప్రత్యేక హోదా సెంటిమెంట్ ఏపీ ప్రజల్లో బలంగా ఉండడంతో ప్రజల్లో మోదీని ముద్దాయిగా నిలిపి తాను ఓట్లు కొల్లగొట్టాలని ఎత్తేశాడు. అంతే కాదు తన మిత్రుడి పవన్ పార్టీని తెలివిగా కమ్యూనిస్టులతో పొత్తు కుదుర్చుకునేలా చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటును భారీగా చీల్చి తాను లబ్ది పొందుదామనుకున్నాడు.కానీ గత ఐదేళ్ల చంద్రబాబు అరాచక పాలనకు విసిగిపోయిన ప్రజలు వైసీపీకి తిరుగులేని మెజారిటీ కట్టబెట్టి చంద్రబాబుకు బుద్ది చెప్పారు. దీంతో చంద్రబాబుకు పొత్తుల్లేకుండా గెలవలేనని అర్థమైంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల నుంచే పాత పొత్తులకు వెంపర్లాడుతున్నాడు. ఎంతగా భజన చేసినా మోదీ, షాలు తనని దగ్గరకు రానివ్వకపోవడంతో చంద్రబాబు తిరిగి మళ్లీ ఎర్ర మిత్రులతో కలువబోతున్నాడు.
ఇక పవన్, బీజేపీతో కలవడంతో ఎర్రన్నలు మళ్లీ చంద్రబాబుతో చెట్టాపట్టాలేసుకుని తిరగడానికి రెడీ అయిపోతున్నారు. ఈ మధ్య అమరావతి ఆందోళనలు ప్రారంభం అయిన దగ్గరనుంచి సీపీఐ నేతలు చంద్రబాబుతో రాసుకుపూసుకు తిరుగుతున్నారు. దీని వెనుక వంద కోట్ల ప్యాకేజీ ఉందని విమర్శలు వస్తున్నాయి. అయితే..స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర పడుతుండడంతో చంద్రబాబు మళ్లీ పొత్తులకు రెడీ అయిపోయాడు. గత 9 నెలలుగా వైసీపీ ప్రభుత్వంపై రోజుకో అంశంతో ఎల్లోమీడియాతో కలిసి దుష్ప్రచారం చేయిస్తున్నాడు. 9 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత కూడగట్టుకుందని పదే పదే వైసీపీని విమర్శిస్తున్నాడు. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళితే వైసీపీకి మాకు వచ్చిన 23 సీట్లు కూడా రావని ఎద్దేవా చేస్తున్నాడు. అయినా చంద్రబాబుకు లోలోపల మాత్రం ఆందోళనగా ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో క్షేత్ర స్థాయిలో ప్రజలు జగన్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారు. అదే చంద్రబాబును భయపడుతుంది. అందుకే ఎర్రన్నలతో పొత్తులకు సిద్ధమవుతున్నాడు.
ఇక పవన్ సినిమాల్లో బిజీగా ఉంటున్నానని చెప్పి ఎన్నికలకు తన పార్టీని దూరం పెట్టే అవకాశం ఉంది. అది కూడా చంద్రబాబుకు అనుకూలంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓట్లు చీల్చమని తన పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చే అవకాశం ఉంది. పైకి బీజేపీతో పొత్తు ఉన్న జనసేన పార్టీ శ్రేణులు టీడీపీకి సహకరించే అవకాశం ఉంది. అందుకే ఎర్ర పార్టీలను కూడా కలుపుకుని ఎన్నికలకు పోయి గెలవాలని చంద్రబాబు స్కెచ్ వేశాడు. ఈ మేరకు తనతో రెండు నెలలుగా రాసుకుని పూసుకుని తిరుగుతున్న సీపీఐ రామకృష్ణ, నారాయణలకు సీపీఎంను ఒప్పించే బాధ్యతను అప్పగించాడు.కాగా ఇప్పటికే ఎర్ర పార్టీలు పూర్తిగా కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక సాయం దండిగా అందించే చంద్రబాబుతో పొత్తు కోసం ఎర్ర పార్టీలు పెద్దగా ఆలోచించవు.సో..స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ పదేళ్ల తర్వాత పసుపు జెండా, ఎర్ర జెండాలు కనువిందు చేయనున్నాయి. మొత్తంగా పొత్తులు లేకుండా ఎన్నికలకు పోయే దమ్ము, ధైర్యం తనకు లేదని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నాడు. ఇక పచ్చ చంద్రబాబు కాస్తా ఎర్ర బాబుగా మారబోతున్నాడు. మరదే బాబుగారి రాజకీయమంటే..!