ఏపీలో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై టీడీపీ అధినేత చంద్రబాబు కుటిల రాజకీయం చేస్తున్నాడు. ప్రభుత్వం స్థానిక సంస్థలలో బీసీలకు 59 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు టీడీపీ నేత బిర్రు ప్రతాపరెడ్డితో హైకోర్ట్‌లో కేసు వేయించాడు. దీంతో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని, అలాగే నెలలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారి చేసింది. హైకోర్ట్ ఆదేశాల మేరకు ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించేందుకు సమాయాత్తం అవుతోంది.అయితే ఒక వైపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసులు వేయించిన చంద్రబాబు..మరోవైపు 50 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లకుండా ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందంటూ ముసలి కన్నీరు కారుస్తూ రాజకీయం చేస్తున్నాడు.
అయితే తాజాగా బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు కుటిల రాజకీయంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బీసీలకు మేలు చేసేందుకే సీఎం జగన్ 58.95 శాతం రిజర్వేషన్లు తెచ్చారని… అయితే బీసీ రిజర్వేషన్లను టీడీపీ నేతలు కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారని మంత్రి బొత్స ఫైర్ అయ్యారు.. తన మనుషులతో రిజర్వేషన్లు అడ్డుకొని చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త సంస్కరణలు తేవడం గొప్ప విషయమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు, మద్యం పంచకుండా కఠిన చట్టాన్ని అమలుపరచడం అభినందనీయమన్నారు. ఎన్నికల్లో డబ్బు పంచుతూ పట్టుబడితే మూడేళ్ల జైలుతో పాటు, అభ్యర్థిపై అనర్హత వేటు పడుతుందన్నారు. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్సార్ సీపీ గెలుపు చాలా కీలకం అని బొత్స పేర్కొన్నారు. స్థానిక సమరంలో అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించి, టీడీపీకి మరోసారి బుద్ధి చెప్పాలని ప్రజలకు మంత్రి బొత్స పిలుపునిచ్చారు. కాగా బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు డబుల్‌గేమ్‌పై వైసీపీ నేతలతో పాటు బీసీ సంఘాలు మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు దిష్టిబొమ్మలను తగలబెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయం మరింతగా వేడెక్కింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ వ్యూహాలు రచిస్తున్నాయి. మరి స్థానిక పోరులో ఏ పార్టీ గెలుస్తుందో చూడాలి.