ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డిని మరో ఇద్దరు సీఎంలు ఫాలో అవుతున్నారు. మూడు రాజధానులు ఏర్పాటుచేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న జగన్‌కు మరో బీజేపీ ముఖ్యమంత్రి జత కలిశారు. ఉత్తరాఖండ్‌లో వేసవి కాల రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు త్రివేంద్ర సింగ్ రావత్ ప్రకటించారు. రాష్ట్ర వేసవి రాజధానిగా గైర్సైన్ను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. దీంతో ఆ రాష్ట్రంలో ఏపీలోలానే మూడు రాజధానులయ్యాయి. ఇప్పటికే రాజధానిగా డెహ్రాడూన్ ఉండగా, నైనితాల్ పట్టణం జ్యుడీషియల్ క్యాపిటల్‌గా కొనసాగుతోంది. తాజాగా, గైర్సైన్ వేసవి రాజధానిగా ఏర్పాటు చేయడంతో మూడు రాజధానుల రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఈ రాష్ట్రం ఆవిర్భవించినపుడు పేరు ఉత్తరాంచల్.. దాదాపు ఆరేళ్ల తర్వాత ఉత్తరాఖండ్గా మారింది. రాష్ట్రం పేరే కాదు, రాజధాని విషయంలోనూ ఈ మార్పు తప్పలేదు. డెహ్రాడూన్‌కు రోడ్డు, రైలు మార్గాలతో కనెక్టివిటీ ఉండడంతో రాష్ట్రానికి అన్ని హంగులతో కొత్త రాజధాని నిర్మాణం పూర్తయ్యేవరకు తాత్కాలిక రాజధానిగా నిర్ణయించారు. అలాగే పర్వత ప్రాంతంలోని నైనితాల్ పట్టణంలో హైకోర్టు ఏర్పాటుచేసి జ్యుడీషియల్ క్యాపిటల్‌గా చేశారు. రాజ్‌భవన్ కూడా అక్కడే ఉంది.
ఇలా రెండు తాత్కాలిక రాజధానులతో ఏర్పాటైన ఉత్తరాఖండ్ రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా నిర్మించాలని నిర్ణయించారు. రాష్ట్రం ఏర్పడక ముందే ఇక్కడ శాశ్వత రాజధానిగా గైర్సైన్ ఖరారైంది. కానీ ఈపేరు ఆ రాష్ట్రవాసులకు తప్ప బయటివాళ్లకు పెద్దగా తెలియదు. రెండు దశాబ్దాల చరిత్ర కల్గిన ఉత్తరాఖండ్ లో గైర్సైన్‌కి మాత్రం దశాబ్దాల చరిత్ర ఉంది. వాస్తవానికి గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఈ డిమాండ్ తీసుకొస్తున్నాయి. చివరకు బీజేపీ సర్కార్ గైర్సైన్ను వేసవి రాజధానిగా ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గైర్సైన్లో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించింది. అధికారుల నివాస భవనాలు సహా పలు భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అలాగే జగన్ సర్కార్ బాటలోనే పక్కనే ఉన్న కర్ణాటక ప్రభుత్వం కూడా గతంలోనే నడవాలని నిర్ణయించింది. కర్ణాటక ప్రభుత్వం తొమ్మిది ముఖ్య కార్యాలయాలను బెంగళూరు నుంచి తరలించాలని నిర్ణయించింది. ఉత్తర కర్ణాటకలోని బెళగావి ప్రాంతానికి తరలించాలని భావిస్తోంది. దీనికి బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. మొత్తంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న 3రాజధానుల నిర్ణయం పలు రాష్ట్రాలకు దిక్సూచిగా మారాయి.