ప్రముఖ పాత్రికేయులు, మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు(86) కన్ను మూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం విజయనగర్ కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1934 ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లాలో జన్మించిన పొత్తూరి పత్రికా రంగంలో 5 దశాబ్దాలకు పైగా సేవలందించారు. 2000లో ‘నాటి పత్రికల మేటి విలువలు’ పేరిట పుస్తకం రచించారు. అదే విధంగా 2001లో చింతన, చిరస్మరణీయులు పుస్తకాలను రచించారు. పీవీ గురించి రాసిన ‘ఇయర్ ఆఫ్ పవర్’కు సహ రచయితగానూ పనిచేశారు. ఉమ్మడి ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా విధులు నిర్వర్తించారు. పొత్తూరి మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. పొత్తూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలుగు జర్నలిజంలో పొత్తూరి పాత్ర మరువరానిదని పేర్కొన్నారు. దశాబ్దాలుగా పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించిన పొత్తూరి వెంకటేశ్వర రావు.. తెలుగు జర్నలిజంలో అందరికీ ఆదర్శప్రాయులన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా పని చేసిన పొత్తూరి ఎందరో పాత్రికేయులను తీర్చిదిద్దారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పొత్తూరి మరణం పట్ల సంతాపం వ్యక్తంచేసారు.
