టీడీపీ చేపట్టిన ప్రజా చైతన్యయాత్రలో ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు, ఆయన పుత్రరత్నం లోకేష్‌లకు వరుస పరాభావాలు ఎదురవుతున్నాయి. కుప్పం, విశాఖలో చంద్రబాబును ప్రజలు అడ్డుకుని తిప్పి పంపించగా…తూగో జిల్లాలో పురుషోత్తపట్నం రైతులు లోకేష్‌ను అడ్డుకుని తమ నిరసన తెలియజేశారు. దీంతో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. రైతుల టెంట్లను ధ్వంసం చేసి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వివరాల్లోకి వెళితే ప్రజా చైతన్యయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం మండలం, మునికూడలికి వెళ్లిన టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్‌ను స్థానిక పురుషోత్తపట్నం ఎత్తిపోతల నిర్వాసితులు, రైతులు, స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. చంద్రబాబు హయాంలో ప్రారంభమైన పురుషోత్తపట్నం నిర్వాసితులకు ఇంత వరకు పరిహారం చెల్లించలేదని, అంతా మీ నిర్వాకమే అంటూ లోకేష్‌ను రైతులు నిలదీశారు. వారికి స్థానిక వైసీపీ నేతలు సంఘీభావం పలికారు. లోకేష్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భగా టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య మొదలైన గొడవ ఘర్షణగా మారి పెద్ద యుద్ధమే జరిగింది. టీడీపీ నేతలు రైతుల టెంట్లను ధ్వంసం చేశారు. ఇరువర్గాలూ కుర్చీలతో కొట్టుకున్నాయి. ఈ గొడవల్లో మహిళా పోలీసులతో పాటు పలువురికి గాయాలయ్యాయి. చివరకు పోలీసులు లాఠీచార్జి చేసి అందరిని చెదరగొట్టారు. అయితే రైతుల తిరుగుబాటుతో ఖంగు తిన్న లోకేష్.. మేం కాన్వాయ్‌లో వస్తుంటే 40 మంది ఇడుపులపాయ దొంగలతో అడ్డుకుంటారా? పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి అడ్డం వస్తారా? ఇది పులివెందుల కాదు, ఇడుపులపాయ కాదు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
అయితే లోకేష్ విమర్శలపై వైసీపీ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. టీడీపీ పాలనలో అన్యాయానికి గురైన పురుషోత్తపట్నం రైతులు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తుంటే లోకేశ్, పెందుర్తి వెంకటేశ్ అనుయాయులు రౌడీలు, గుండాల్లా వారిపై దాడి చేశారని రాజా ఆరోపించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు వీధి రౌడీలు, గూండాల్లా ప్రవర్తించారని దుయ్యబట్టారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బాధిత రైతులపై దాడులు చేయడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు.. దాడుల కోసం రాజమహేంద్రవరం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తీసుకువచ్చి కర్రలతో దాడులు చేశారన్నారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు.తాము తలచుకుని ఉంటే లోకేశ్‌ను బట్టలూడదీసి తన్నేవాళ్లమని, . ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లేవారు కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ ఘటనపై ఎల్లోమీడియా మసిపూసి మారేడు కాయ చేస్తోంది.లోకేష్‌ను పురుషోత్తమ పట్నం రైతులు, నిర్వాసితులు అడ్డుకుంటే..వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేశారంటూ పచ్చ కథనాలు వండివారుస్తోంది. ఇక చంద్రజ్యోతి పత్రికలో అయితే ఎక్కడా పురుషోత్తమ పట్నం నిర్వాసితులు, రైతుల గురించి ప్రస్తావనే లేదు…ఎంతసేపు వైసీపీ నేతలే అడ్డుకున్నారంటూ సదరు ప్రతిక అసత్యకథనం ప్రచురించింది. మొత్తంగా ప్రజా చైతన్యయాత్రలో లోకేష్‌పై రైతులు తిరగబడిన ఘటన..రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది.