కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. కొవిడ్-19 వైరస్‌ను గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వయంత్రాంగం అప్రమత్తమయిందని.. వైరస్ వ్యాప్తిచెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారని.. కరోనాను ఎదుర్కొనేందుకు రూ.100 కోట్ల నిధులు మంజూరుచేశారని వివరించారు.
కరోనావైరస్‌పై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. దీనిని ఎదుర్కొనేందుకు ఆయాశాఖలు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం మంత్రివర్గఉపసంఘం భేటీ అయింది. ఎంసీఆర్‌హెచ్చార్డీలో మంత్రులు కే తారకరామారావు, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు.. వివిధశాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్. వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్‌సెక్రటరీ ఏ శాంతికుమారి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ యోగితారాణా, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ జీ శ్రీనివాసరావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి, వివిధ ఆరోగ్యసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కరోనా విస్తరించకుండా ప్రభుత్వశాఖల మధ్య సమన్వయానికి కో-ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటుచేయాలని సమావేశంలో నిర్ణయించారు.