తెలంగాణలో నాగార్జునసాగర్ ఎడమకాల్వ పునర్జీవానికి తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం (ట్రీ) రూ.1700 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. దాదాపు 6.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు శాశ్వత నీటి భరోసా కల్పించేలా రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి ట్రీ సమర్పించింది.
సీతారామ ఎత్తిపోతల పథకంలోని ప్రధానకాల్వను ఆధారం చేసుకొని ఈ పునర్జీవ పథకానికి రూపకల్పనచేసిన దరిమిలా తక్కువ ఖర్చుతోనే బహుళ ప్రయోజనాలు పొందవచ్చని నివేదికలో ట్రీ పేర్కొన్నది. ఈ పథకంతో మున్నేరు జలాల్ని కూడా
వినియోగంలోకి తీసుకురావచ్చని చెప్తున్నారు.
కృష్ణానదిపై ఎగువన కర్ణాటక పలు ప్రాజెక్టులు నిర్మించడం, శ్రీశైలంపై పలు సాగునీటి ప్రాజెక్టులు రావడంతో కృష్ణాజలాల వినియోగం భారీస్థాయికి చేరింది. దీంతో నాగార్జునసాగర్ ఆయకట్టు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో సాగర్ ఎడమకాల్వ కిందున్న ఆయకట్టుకు గోదావరిజలాలతో శాశ్వత భరోసా కల్పించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఇందుకు సీతారామ ప్రాజెక్టుద్వారా గోదావరిజలాల తరలింపును చేపట్టారు