ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఒకేసారి నాలుగు లక్షలకు పైగా గ్రామవాలంటీర్ల ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా, లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా వింగ్, ఎల్లోమీడియా ఛానళ్లు, గ్రామవాలంటీర్లను పలుమార్లు కించపరిచాయి. గ్రామవాలంటీర్లు బండిపై సరుకులు మోసే కూలీలుగా టీడీపీ సోషల్ మీడియా చిత్రీకరిస్తే..చంద్రబాబు ఏకంగా ఇంట్లో మగవాళ్లు లేనప్పుడు గ్రామవాలంటీర్లు వచ్చి తలుపులు కొడితే..ఆడవాళ్ల పరిస్థితేంటీ అంటూ అసభ్య వ్యాఖ్యలు చేశాడు. అసలు గ్రామవాలంటీర్ల జీతాలు ఎంత..వాళ్లకు పిల్లను కూడా ఇవ్వరు అంటూ చంద్రబాబు నోరుపారేసుకున్నాడు.
అయితే గ్రామవాలంటీర్లు మాత్రం చక్కగా తమ విధులను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చేరవేస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా గ్రామవాలంటీర్లు నిలుస్తున్నారు. తాజాగా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా గ్రామవాలంటీర్లు విజయవంతంగా పూర్తి చేశారు. తెల్లవారుజాము నుంచే లబ్దిదారుల ఇండ్లకు వెళ్లి…పింఛన్లు అందించారు. దీంతో గ్రామవాలంటీర్ల విధి నిర్వహణపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా…గ్రామవాలంటీర్లను ప్రశంసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పుత్రరత్నంపై తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు. గ్రామ వలంటీర్లెంత? వాళ్ల జీతాలెంత? పెళ్లి చేసుకోవాలంటే సంబంధం కూడా దొరకదని హేళన చేశాడు చంద్రబాబు… అప్రయోజకుడైన ఆయన పుత్రరత్నం నాలుగున్నర లక్షల మంది వలంటీర్లలో ఒక్కరితో కూడా సరితూగలేడు. సిఎం జగన్ గారు అప్పగించిన బాధ్యతను సైనికుల్లా నిర్వర్తిస్తున్నారు. హాట్సాఫ్ అంటూ ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి ఈ మేరకు గ్రామవాలంటీర్లు లబ్దిదారులకు పింఛన్లు అందిస్తున్న ఫోటోలతో రూపొందించిన డిజైన్‌ను పోస్ట్ చేశారు. గ్రామవాలంటీర్ల సమర్థత ముందు…బాబుగారి పుత్రరత్నం లోకేష్ ఏ మాత్రం సరితూగలేడంటూ…విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.