విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబును అడ్డుకున్న ఘటన నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. కడప, పులివెందుల నుంచి వచ్చిన వాళ్లే చంద్రబాబును అడ్డుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే…విశాఖలో రాజధాని ఏర్పాటుపై కుట్రలు చేస్తున్న చంద్రబాబును ప్రజాసంఘాలు, ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకున్నారని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అయితే మరోసారి చంద్రబాబు విశాఖ పర్యటనకు సిద్ధం కావడంతో రాజకీయం మరింత వేడెక్కింది. ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్దేశిస్తూ విశాఖ సిటీ వైసీపీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ చేసిన ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజాగా ఎయిర్‌పోర్ట్ ఘటనపై విశాఖలో మీడియాతో మాట్లాడిన వంశీకృష్ణ తన పర్యటనను అడ్డుకున్నారన్న కోపంతో ఉత్తరాంధ్ర ప్రజలపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు.. అయితే విశాఖలో రాజధాని ఏర్పాటుకు చంద్రబాబుకు సహకరిస్తే మాత్రం సీన్ మరోలా ఉంటుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు.. ప్రత్యేకించి వైజాగ్ నగర వాసులు బేసిగ్గా శాంతికాముకులు… విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుకుకు చంద్రబాబుతోపాటు ఎవరు మద్దతి ఇచ్చినా పూలతో స్వాగతం పలుకుతారంటూ సంచలన ప్రకటన చేశారు.. కాని రాజధాని ఏర్పాటుకు అడ్డుపడితే మాత్రం చంద్రబాబు కాదు కదా…ఎవరినైనా సరే కాలు కూడా పెట్టనివ్వరు” అంటూ వంశీకృష్ణ స్పష్టం చేశారు.
ఇక వైజాగ్‌లో రాజధాని ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న విమర్శలపై వంశీకృష్ణ మండిపడ్డారు. చంద్రబాబు నాన్ లోకల్ కాబట్టి ఉత్తరాంధ్ర గురించి ఏదైనా మాట్లాడుతాడు…అంతే కానీ ఇదే ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే గణేశ్ కుమార్ కూడా బాబుకు వత్తాసు పలకడంలో అర్థంలేదు. గణేశ్ తోపాటు ఇంకా ఎవరైనా ఉండటం ఇష్టంలేకపోతే ఉత్తరాంధ్ర నుంచి నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చు.. అంతేగానీ ఇక్కడే ఉంటూ అభివృద్ధికి అడ్డుతగులుతామంటే చూస్తూ ఊరుకోబోము”అని వంశీకృష్ణ హెచ్చరించారు. మొత్తంగా వైజాగ్‌లో రాజధాని ఏర్పాటుకు సహకరిస్తే చంద్రబాబుకు పూలతో స్వాగతం పలుకుతామంటూ వైసీపీ నేత వంశీకృష్ణ శ్రీనివాస్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ కోసం గొంగలి పురుగునైనా సంతోషంగా ముద్దుపెట్టుకుంటా అంటూ తరచుగా అనేవారు…అదే స్టైల్లో విశాఖలో రాజధానికి ఒప్పుకుంటే చంద్రబాబుకు కూడా పూలతో స్వాగతం పలుకుతామని వంశీ చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. అయితే ఉత్తరాంధ్రలో అమరావతి ఉద్యమాన్ని తీసుకువెళ్లాలని చూస్తున్న చంద్రబాబు విశాఖలో రాజధాని ఏర్పాటుకు ఒప్పుకోవడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో మరోసారి చంద్రబాబు వైజాగ్ పర్యటన మరింత వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది..మరి మున్ముందు విశాఖ రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.