మిర్యాలగూడలో ప్రణయ్ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తన కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందనే కారణంతో ఆమె భర్త ప్రణయ్‌ను చంపించిన మారుతిరావు జైలుకు వెళ్లి కొంత కాలం కిందట బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే ప్రణయ్ హత్య తర్వాత కూడా అమృత తన అత్తమామల ఇంట్లోనే ఉంటున్నారు. ఇదిలా ఉంటే… తాజాగా మారుతిరావుకు చెందిన షెడ్డులో ఓ శవం బయటపడడం మిర్యాలగూడలో తీవ్ర కలకలం రేపుతోంది. . ప్రణయ్ హత్య కేసులో నిందితుడు, రైస్ మిల్లుల వ్యాపారి అయిన మారుతిరావుకు పట్టణ శివారులోని అద్దంకి-నార్కట్‌పల్లి బైపాస్ రోడ్డులో ఓ స్థలం ఉంది. చాలా ఏళ్ల కిందట ఆ స్థలంలో ఓ రేకుల షెడ్డు నిర్మించి వదిలేశారు. ఆ షెడ్డులో నుంచి కొద్దిరోజులుగా దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కలవాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు షెడ్డుకు వెళ్లి చూడగా అక్కడో గుర్తుతెలియని మృతదేహం కనిపించింది. దుర్వాసన రాకుండా ఉండేందుకు శవంపై ఆయిల్ పోసినప్పటికీ, ఎక్కువ రోజులు కావడంతో దాదాపు కుళ్లిపోయే స్థితికి చేరింది.
కాగా మారుతిరావు షెడ్డులో లభించిన మృతదేహం ఎవరిదో కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతుడి వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండొచ్చని, జీన్స్ ప్యాంటు, బ్లూషర్టు ధరించి ఉన్నాడని పోలీసులు చెప్పారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిని బట్టి 10 రోజుల కిందటే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యోదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మారుతిరావు నేరచరిత్ర నేపథ్యంలో ఆయన షెడ్డులో మృతదేహం కనిపించడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి షెడ్డు ఓనర్ మారుతిరావును కూడా ప్రశ్నిస్తామని పోలీసులు చెప్పారు. పోస్ట్ మార్టం ప్రాధమిక రిపోర్టును బట్టి దర్యాప్తు వేగవంతం చేస్తామని సీఐ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. తాజా హత్యోదంతంతో మారుతిరావుకు సంబంధం ఉందా? లేదా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సిఉంది. కాగా షెడ్డులో శవంతో మరోసారి మారుతిరావు వార్తల్లోకి ఎక్కారు. మొత్తంగా ప్రణయ్ హత్యోదంతం తర్వాత మారుతిరావుకు చెందిన షెడ్డులో మరో శవం బయటపడడం మిర్యాలగూడలో సంచలనంగా మారింది.