చంద్రబాబు హయాంలో అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై జగన్ సర్కార్ నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌తో పాటు సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కంచికచర్ల మార్కెటయార్డ్ మాజీ ఛైర్మన్ నన్నపనేని లక్ష్మీ నారాయణ, ఆయన కుమారుడు సీతారామరాజు ఇళ్లల్లో సీఐడీ, సిట్ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలతోపాటు రెండు సీడీలను స్వాధీనం చేసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అడ్వొకేట్ జనరల్‌గా(ఏజీ) పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్.. నన్నపనేని లక్ష్మీనారాయణకు స్వయానా అల్లుడే. కాగా, లక్ష్మీనారాయణ కుమారుడు సీతారామరాజు టీడీపీ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్‌గా వ్యవహరించారు. పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారు. టీడీపీ నేత లక్ష్మీనారాయణ అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ముందుగానే తెలుసుకుని విలువైన భూములను రైతుల నుంచి తక్కువ ధరకు కొనేశారని స్థానికులు చెబుతున్నారు. కాగా లక్ష్మీనారాయణ టీడీపీ బడానేతలకు బినామీ అని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే చంద్రబాబు హయాంలో ఇరిగేషన్ మినిష్టర్ అయిన దేవినేని ఉమ లక్ష్మీ నారాయణ కుమారుడు సీతారామరాజుకు పోలవరం సబ్ కాంట్రాక్టులు ఇప్పించి, భారీగా ఎస్టిమేషన్లు పెంచి లబ్ది చేకూర్చారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో దేవినేని ఉమాకు, టీడీపీ పెద్దలకు పెద్ద ఎత్తున కమీషన్లు అందినట్లు తెలుస్తోంది.
తాజాగా లక్ష్మీనారాయణపై సిట్, సీఐడీ అధికారుల సోదాల నేపథ్యంలో టీడీపీ హయాంలో జరిగిన అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై స్వయానా దేవినేని ఉమా సోదరుడు, దేవినేని చంద్రశేఖర్ స్పందించారు. ఫిబ్రవరి 29 న విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. మాజీమంత్రి దేవినేని ఉమా అండదండలతో రాజధాని పేరుతో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతల అవినీతిపై విచారణ జరిపితే ప్రముఖుల బండారం బయటపడుతుందని దేవినేని చంద్రశేఖర్ అన్నారు. ఇక టీడీపీ నేత లక్ష్మీనారాయణ ఇంట్లో సిట్, సీఐడీ అధికారులు జరిపిన సోదాలపై స్పందిస్తూ… సామాన్య రైతు కుటుంబానికి చెందిన లక్ష్మీనారాయణ, ఐదేళ్ల టీడీపీ పాలనలో పెద్ద ఎత్తున అవినీతి సొమ్ము కూడగట్టారని, రాజధాని ప్రాంతంలో బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కి పాల్పడ్డారని ఆరోపించారు. సీఐడీ సోదాల్లో దొరికింది చాలా తక్కువ… వారి అవినీతిపై మరింత లోతుల్లోకెళ్లి విచారణ జరిపితే చాలా అక్రమాలు బయటపడతాయని దేవినేని చంద్రశేఖర్ అన్నారు. లక్ష్మీనారాయణ కొడుకు సీతారామరాజు రియల్ ఎస్టేట్ కంపెనీలో సోదాలు చేస్తే మొత్తం వ్యవహారం బయటపడుతుందని, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో లక్ష్మీనారాయణ వెనక ఉన్న ప్రముఖ నేతల బండారం కూడా బహిర్గతం అవుతుందని ఉమ సోదరుడు, దేవినేని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో చంద్రబాబు, మాజీ మంత్రుల ప్రమేయంపై స్వయానా దేవినేని ఉమా సోదరుడు, దేవినేని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి.