విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకున్న ఘటనపై టీడీపీ రాజకీయం మొదలుపెట్టింది. తనను అడ్డుకున్నది ప్రజలు కాదని పులివెందుల నుంచి వచ్చిన రౌడీలు, వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులని స్వయంగా చంద్రబాబు ఆరోపించాడు. టీడీపీ నేతలు పులివెందుల రౌడీలు, గూండాలు అంటూ సీమ ప్రజలను కించపరుస్తున్నారు. కాగా టీడీపీ నేతల ఆరోపణలను వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. గతంలో జగన్‌ను అడ్డుకున్నది గుర్తులేదా చంద్రబాబు…ఇప్పుడు ప్రజలు అడ్డుకుంటే…తమపై ఎందుకు బురదజల్లుతున్నారని మండిపడుతున్నారు. తాజాగా విశాఖ ఎయిర్‌పోర్ట్ ఘటనపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దాడి వీరభద్రరావు స్పందించారు. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రలను తెలివి తక్కువ యాత్రలుగా పరిగణిస్తున్నామని దాడి వీరభద్ర న్నారు. పార్టీలతో సంబంధం లేకుండా చంద్రబాబు వైఖరి పట్ల విరక్తి చెందిన స్థానిక ప్రజలే ఆయనను అడ్డుకున్నారని తెలిపారు. మూడేళ్ల క్రితం ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాండిల్ ర్యాలీకి వస్తే కనీసం ఎయిర్ పోర్టులోకి కూడా పోలీసులు అనుమతించలేదు. కానీ, నేడు పోలీసులు కొన్ని నిబంధనలు పెట్టి చంద్రబాబుకు అనుమతులిచ్చారని దాడి చెప్పారు. అయినా పోలీసులు అనుమతులిచ్చినా ప్రజలు అంగీకరించొద్దా? చంద్రబాబు పర్యటన కోసం లాఠీచార్జి చేయాలా…షూట్ ఎట్ సైట్ చేయాలా? అని ప్రశ్నించారు. ఓ వైపు ఢిల్లీ అగ్నిగుండం అవుతుంటే, జాతీయ నేతగా చెప్పుకునే చంద్రబాబు వైఖరి ఇదేనా? అని నిలదీశారు. రాజకీయ బాధ్యత గల వ్యక్తి విశాఖలో అరాచకం సృష్టించడాన్ని ఖండిస్తున్నాం అంటూ దాడి ధ్వజమెత్తారు.
ఇక పులివెందుల రౌడీలు అంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై దాడి మండిపడ్డారు. ఎక్కడేం జరిగినా కడప, పులివెందుల అని మాట్లాడ్డం చంద్రబాబుకు అలవాటని ఫైర్ అయ్యారు. అక్కడి ప్రజలను రౌడీలుగా, గుండాలుగా పరిగణించి వారి మనోభావాలను కించపరుస్తున్నారని ఆక్షేపించారు. తన కాన్వాయ్‌పై వైసీపీ కార్యకర్తలు చెప్పులు, టమాటాలు, గుడ్లు విసిరారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై దాడి కౌంటర్ ఇచ్చారు. మరి 1994లో మీరు చేసిన పనేంటి? సొంత మామగారైన స్వర్గీయ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, కుర్చీ లాక్కుని, ఆయన వైస్రాయ్ హోటల్‌కు వచ్చినప్పుడు చెప్పులు, కోడిగుడ్లు, టమాటాలు విసరలేదా చంద్రబాబు? అని ప్రశ్నించారు. పాపం ఎన్టీఆర్ చేతులు అడ్డం పెట్టుకుని తనను తాను రక్షించుకోవడం ప్రత్యక్షంగా చూసానని దాడి తెలిపారు. ఎన్టీఆర్ వెన్నుపోటుకు విశాఖ నుంచే ఎమ్మెల్యేలతో ఆయన పథక రచన చేశారని, రాజకీయాల కోసం ఎంతటి స్థాయికయినా బాబు దిగజారుతారని దాడి ఆరోపించారు. విశాఖలో రాజధాని ఏర్పాటు కాకుండా చంద్రబాబు చేస్తున్న కుట్రలపై ఉత్తరాంధ్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని..అందుకే ఆయన్ని అడ్డుకున్నారని దాడి స్పష్టం చేశారు. అలాగే 1994 ఆగస్టు ఎపిసోడ్‌పై సీఎం వైఎస్ జగన్ జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేయాలని సీఎం జగన్‌ను దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు. మొత్తంగా విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో తనపై చెప్పులు, టమాటాలు, గుడ్లు విసిరారని రాజకీయం చేస్తున్న చంద్రబాబుకు గతంలో ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన ఘటనను గుర్తు చేసి మరీ దాడి వీరభద్రరావు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఎయిర్‌పోర్ట్ ఘటనపై నిజమైన టీడీపీ అభిమానులు స్పందిస్తున్నారు… దేవుడు ఉన్నాడు..అన్ని లెక్కలు సరి చేస్తాడు..ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన పాపం ఊరకే పోదు చంద్రబాబు అంతకు అంత అనుభవిస్తావు అంటూ నిజమైన టీడీపీ అభిమానులు, నందమూరి అభిమానులు శాపనార్థాలు పెడుతున్నారు.