నీతి, నిజాయితీ , చేసే పనిపట్ల నిబద్దత , కర్తవ్య నిర్వహణలో రాజీలేని తత్వం, అంతకు మించి అంకితభావంతో ప్రజలకు సేవచేసే అధికారులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు..అలాంటి కోవకు చెందిన అతి కొద్ది మంది అధికారుల్లో నిజామాబాద్ కలెక్టర్ సి. నారాయణరెడ్డి ముందు వరుసలో ఉంటారు. నిత్యం విధి నిర్వహణలో ఉంటూ..ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉండే అధికారులను చూస్తూ ఉంటాం.. కాని ఓ సామాన్యుడిలా ప్రజలతో మమేకం అయ్యే నారాయణరెడ్డి లాంటి అధికారులు చాలా అరుదుగా ఉంటారు. తాను ఎక్కడ పని చేసినా ప్రజలకు అందుబాటులో ఉంటూ..అప్పటికప్పుడు వారి సమస్యలను తీర్చడం ఒక్క నారాయణరెడ్డికే సాధ్యం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తూనే…క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి..వాటిని తక్షణమే పరిష్కరించడంలో నారాయణ రెడ్డి చూపే చొరవ ప్రశంసనీయం.
కలెక్టర్ నారాయణరెడ్డి అనగానే ఆయనేదో పుడుతూనే గోల్డెన్ స్పూన్‌తో పుట్టలేదు.. మనలాగే ఓ సగటు మనిషి.ఆయన అసలుసిసలు తెలంగాణ మట్టిబిడ్డ.. మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలంలోని శ్రీపురం అనే గ్రామంలో చింతకుంట చెన్నారెడ్డి, నర్సింగమ్మ దంపతుల ఆరో సంతానంగా జన్మించిన నారాయణరెడ్డిది వ్యవసాయ కుటుంబ నేపథ్యమే. ఏడో తరగతి చదువుతున్నప్పుడే తండ్రి చెన్నారెడ్డి కన్నుమూయడంతో అప్పటినుంచీ అన్నలే ఆయనకు అన్నీ అయి పెంచి చదివించారు. చదువు కోసం ఆయన కూడా మనలాగే వాగులు, ఒర్రెలు దాటినవారే. మధ్యలో చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చినా అందివచ్చిన అవకాశాలను ఆసరాగా చేసుకుని జీవిత ఉన్నత శిఖరాలకు మెట్లుగా మలచుకున్నాడు. 3వ తరగతి వరకు శ్రీపురంలో, 4నుంచి 7 వరకు పక్కనే ఉన్న కల్వాల్‌లో, 8 నుంచి ఇంటర్‌వరకు మక్తల్‌లో, డిగ్రీ నారాయణఖేడ్‌లో చదివిన నారాయణరెడ్డి బీఈడీ కోర్సును ఉస్మానియా యూనివర్శిటీలో చదివారు. ఓ దశలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియమితులైనా అంతటితో సంతృప్తిచెందకుండా అనుకున్న లక్ష్య సాధన కోసం అహర్నిశలు శ్రమించాడు 2008లో గ్రూప్-1 రాసి మొదటి ప్రయత్నంలోనే స్టేట్ 4వ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం సంపాదించారు. 2011లో గద్వాల ఆర్డీఓగా, ఆ తర్వాత 2011లో పెద్దపల్లి ఆర్డీఓగా, అనంతరం ఈ ఏడాది జూలైలో సూర్యాపేట ఆర్డీఓగా పనిచేసిన ఆయన జిల్లాల విభజన నేపథ్యంలో నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
విధి నిర్వహణలో ఎన్ని వత్తిళ్లు వచ్చినా..వెనకడుగు వేయని తత్వం…అవినీతి, అక్రమాలను ఉపేక్షించలేని గుణం..నారాయణరెడ్డిని ప్రత్యేకంగా నిలిపాయి. వివిధ శాఖల్లో క్రింది స్థాయిలో పేరుకుపోయిన అవినీతిని కూకటి వ్రేళ్లతో పెకిలించిన డైనమిక్ ఆఫీసర్ సి. నారాయణ రెడ్డి. నల్గొండ జిల్లాలో రెండు సంవత్సరాలకు పైగా జాయింట్ కలెక్టర్‌గా పని చేసిన నారాయణ రెడ్డి ప్రజలకు పారదర్శకంగా_జవాబుదారీతనంగా, అవినీతిరహితంగా పాలన అందించి జిల్లా ప్రజల మన్ననలను అందుకున్నారు. ఆ తర్వాత కలెక్టర్‌గా పదోన్నతి పొంది ములుగులో విధులు నిర్వహించిన నారాయణరెడ్డి అక్కడ కూడా తన సమర్థత పాలనా దక్షతతో రాణించారు. ప్రతిష్టాత్మక మేడారం జాతరకు అన్నీ తానై అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పూర్తి చేయించారు. ప్రధాన రహదారులు, సివిల్ వర్క్స్, పార్కింగ్ వసతులు, జంపన్న వాగు పనులు, తాత్కాలిక టాయిలెట్స్, బాత్రూంలు, షెడ్స్ ఇలా అన్ని పనులను శరవేగంతో అధికారులను పరుగులు పెట్టించి పూర్తి చేయించారు. మేడారం జాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా ప్రకటించి..ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. అయితే అయితే మేడారం జాతర ప్రారంభానికి కొన్ని రోజుల ముందు నిజామాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ అయినా… ఈసారి జాతరలో కోటిన్నరమంది భక్తులకు చిన్న అసౌకర్యం కూడా కలుగలేదంటే అది కలెక్టర్‌గా నారాయణ రెడ్డి తీసుకున్న ముందు జాగ్రత్తలే అని చెప్పవచ్చు.
కలెక్టర్ నారాయణరెడ్డి అసలు సిసలైన తెలంగాణ మట్టి బిడ్డ..తెలంగాణ ప్రజల అమాయకత్వం..వెనుకబాటుతనం, తెలంగాణ ఆకలి కేకలు..ఆయనకు తెలుసు.. అందుకే ఆయన అధికారి అయినా…మట్టిమనిషిగా ఒదిగే ఉన్నారు..ఇప్పటికీ అదే నిరాడంబరత..ఆయనలా పేద ప్రజలతో మమేకం అయ్యే అధికారిని మనం చూడలేం. కలెక్టరేట్‌కు నిత్యం ఎంతో మంది బడుగులు, వృద్దులు తమ సమస్యల కోసం వస్తుంటారు..ఆఫీసుల చుట్టూ రోజుల తరబడి తిరుగుతుంటారు.. నారాయణ రెడ్డి ఎక్కడ పని చేసినా… పేదలను ప్రేమగా పలకరించి…ఓపికగా ఫిర్యాదులన్నింటిని స్వీకరించి..వెంటనే వారి సమస్యలను పరిష్కరిస్తారు. అందుకే ఆయన ఓ బ్యూరోక్రాట్‌గా కాకుండా..ప్రజల మనిషిగా పేరుగాంచారు. ఆయన సింప్లిసిటీకి నిదర్శనంగా ఒక్క సంఘటన చెప్పవచ్చు..ములుగు నుంచి నిజామాబాద్‌లో కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నారాయణ రెడ్డి ఓ సారి ఎటువంటి హంగూ, ఆర్భాటం లేకుండా, కనీసం సెక్యూరిటీ కూడా లేకుండా…ఓ సామాన్యుడిలా నగర వీధుల గుండా సైకిల్ తొక్కుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ . ఓ సాధారణ వ్యక్తిలా ఆయన ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. అందుబాటులో ఉన్న సిబ్బంది నుంచి ఆస్పత్రిలో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలు తెలుసుకున్నారు. ఉదయం విధుల్లో ఉండాల్సిన డాక్టర్లు, ఇతర సిబ్బంది హాజరు కాకపోవడంతో వారికి మెమోలు జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక వైద్య సదుపాయాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. తమలో ఒకడిగా సైకిల్‌పై వచ్చి తమను పలకరిస్తుందని కలెక్టర్ నారాయణరెడ్డి అని తెలిసి రోగులు ఆశ్చర్యానందం వ్యక్తం చేశారు. ఈ ఒక్క సంఘటన చాలు కలెక్టర్ నారాయణ రెడ్డికి పేదలంటే ఎంత ప్రేమో..పేదల సమస్యల పరిష్కారానికి ఆయన చూపే చొరవ ఏంటో…ప్రస్తుతం అవినీతి, అక్రమాలతో కునారిల్లుతున్న బ్యూరోక్రాట్ వ్యవస్థకు..తులసీవనంలో గంజాయి మొక్కలా కలెక్టర్ నారాయణరెడ్డి లాంటి వ్యక్తులు నిజంగా వన్నె తెస్తున్నారనడంలో సందేహం లేదు..హ్యాట్సాప్ నారాయణరెడ్డి సార్..కలెక్టర్‌గా పదోన్నతి పొంది ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మీరు ఇలాగే ప్రజలకు సేవలందిస్తూ వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటోంది..విష్ యు గుడ్‌లక్ సర్..