కృష్ణాజిల్లా కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నన్నపనేని లక్ష్మీనారాయణ ఇంటికి సిఐడి అధికారులు నోటీసులు అందించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోలు విషయమై సోదాలు నిర్వహించేందుకు సిఐడి అధికారులు వచ్చారు. లక్ష్మీనారాయణ అల్లుడు దమ్మాలపాటి శ్రీనివాసరావు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గా పనిచేసారు. ఈక్రమంలో సీఐడీ అధికారులు ఇంటికి సర్చ్ నోటీస్ అంటించి వెళ్ళారు. అధికారులు వచ్చే సమయానికి లక్ష్మీనారాయణ కుటుంబీకులు అందుబాటులో లేకపోవడంతో ఇలా చేసారు. లక్ష్మీనారాయణ ఇంటి లోకి పోలీసులు ఎవర్నీ అనుమతించలేదు. లక్ష్మీనారాయణ కుమారుడు సీతారామరాజు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్ గా ఉన్నారు.
