విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకున్న ఘటన ఇప్పుడు టీడీపీలో చిచ్చు రేపుతోంది. వికేంద్రీకరణ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి ఆందోళనలను నడిపిస్తుంటే మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటాతో సహా మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటుకు మద్దతుగా తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని ఏకంగా చంద్రబాబుకే పంపారు. కాగా చంద్రబాబు అమరావతికి జై కొట్టడంతో ఉత్తరాంధ్ర టీడీపీ క్యాడర్ చెల్లాచెదురు అయింది. వైజాగ్‌లో రాజధాని ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఎల్లోమీడియాతో కలిసి విషం కక్కుతున్న చంద్రబాబుపై ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. గంటా, గణబాబు, పల్లా శ్రీనివాసరావులాంటి నేతలు బాబు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో అడుగుపెట్టాలని చూసిన చంద్రబాబుకు ఎయిర్‌పోర్ట్‌లో ఉత్తరాంధ్ర ప్రజల చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటును అడ్డుకుంటున్న చంద్రబాబును విశాఖలో అడుగుపెట్టనిచ్చేది లేదని ప్రజలు తిరగబడ్డారు. ఆయన కాన్వాయ్‌పై టమాటాలు, కోడిగుడ్లు, చెప్పులు విసిరారు..ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు గో బ్యాక్ అంటూ ఎయిర్‌పోర్ట్ పరిసరాలు ప్రజల నినాదాలతో మార్మోగిపోయాయి..అంతే కాదు..చంద్రబాబుతో పాటు అచ్చెంనాయుడు లాంటి నేతల కార్లను కూడా అడ్డుకున్నారు. 5 గంటల పాటు చంద్రబాబు నడిరోడ్డు మీద కూర్చుని పోలీసులపై రంకెలు వేస్తూ..హైడ్రామా నడిపించాడు.
అయితే ఇంత జరుగుతున్నా..గంటా, గణబాబు. పల్లా శ్రీనివాస్‌రావులాంటి నేతలు..ఎయిర్‌పోర్ట్‌కు రాలేదు..దీంతో వీరి వ్యవహారం విశాఖ టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా చంద్రబాబు టూర్‌కు డుమ్మా కొట్టడం కాంట్రవర్సీగా మారింది. గత కొద్ది నెలలుగా గంటా పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తొలుత వైసీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత బీజేపీలో చేరడం ఖాయమైందని మరో వార్త ఊపందుకుంది. అయితే గంటా మాత్రం ఇంకా టీడీపీలోనే కొనసాగుతున్నారు. కొద్ది రోజుల కింద గంటా స్వయంగా బిజేపీ కార్యకర్తలను టీడీపీలో చేర్పించాడు. ప్రజా చైతన్యయాత్ర కార్యక్రమాన్ని కూడా తన నియోజకవర్గంలో ప్రారంభించాడు. దీంతో గంటా టీడీపీలోనే కొనసాగుతారని తెలుగు తమ్ముళ్లు భావించారు. అయితే విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు ఘోర పరాభవం జరుగుతుంటే గంటా కనిపించకపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పైకి టీడీపీలో ఉంటూ పార్టీ కార్యక్రమాలు నడిపిస్తున్నా..లోలోపల మాత్రం గంటాకు పార్టీలో కొనసాగడం ఇష్టం లేదని తెలుస్తోంది. అందుకే చంద్రబాబు టూర్‌కు డుమ్మాకొట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గంటాతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు విశాఖలో రాజధాని ఏర్పాటును చంద్రబాబు అడ్డుకుంటున్నాడనే పేరుతో పార్టీకి గుడ్ బై చెప్పినా ఆశ్చర్యం లేదని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. మొత్తంగా గంటాతో చంద్రబాబు నానా తంటాలు ఎదుర్కొంటున్నాడు.. విశాఖ టీడీపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్..