జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చిరంజీవి నివాసం ముట్టడికి అమరావతి ఐకాస నేతలు వస్తున్నారన్న సమాచారంతో ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే, చిరంజీవి నివాసం ముట్టడికి తాము పిలుపు ఇవ్వలేదని, కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని అమరావతి ఐకాస నేతలు స్పష్టం చేశారు.ఈ ప్రచారానికి ఐకాసకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అసత్య ప్రచారం చేస్తున్న అల్లరి మూకలపై చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల పోలీసులకు ఐకాస నేతలు విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతికి మద్దతుగా ప్రముఖ సినీనటుడు చిరంజీవి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ 29న ఉదయం 11 గంటలకు ఆయన నివాసం ముట్టడించాలని నిర్ణయించినట్లు అమరావతి యువ జేఏసీ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే ప్రచారం చేసినవారు ఒక్కరు కూడా రాకపోగా చిరంజీవి అభిమానులు మాత్రం ఆయన ఇంటికి చేరుకున్నారు. చిరంజీవిపై దుష్ప్రచారం చేస్తే ఖబడ్దార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
