‘తలాపున పారుతుంది గోదారి.. మా చేను, మా చెలక ఎడారి..’ అనే ఉద్యమ గీతాన్ని పూర్తిగా మార్చేసిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఘట్టం సాక్షాత్కారానికి ముహూర్తం సమీపించింది. తలాపున పారుతున్న గంగమ్మను ఒడిసిపట్టి.. దాదాపు పది దశల్లో ఎత్తిపోసి.. తెలంగాణలోనే గరిష్ఠ ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్‌కు తరలించే ప్రక్రియ త్వరలో ప్రారంభంకానున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ జలసంకల్పంలో భాగంగా ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్న కాళేశ్వరం ఎత్తిపోతలతో ఫిబ్రవరిలోనూ అనేక చెరువులు నిండుకుండల్లా మారాయి. గోదావరి నదీగర్భం నుంచి 200 మీటర్లకుపైగా ఎత్తున ఉన్న శ్రీరాజరాజేశ్వర జలాశయంలోకి ఇప్పటికే నీటిని తరలిస్తున్నారు.
అక్కడినుంచి మరో 300 మీటర్లకుపైగా ఎత్తున్న కొండపోచమ్మలోకి ఎత్తిపోసేందుకు రంగం సిద్ధమవుతున్నది. దీంతో త్వరలోనే తెలంగాణ గడ్డపై గోదావరి బేసిన్‌లో అత్యధిక ఎత్తున కాళేశ్వరం జలాలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఉన్న ఎత్తిపోతల పథకాల్లో గరిష్ఠస్థాయిని అధిగమించడం మరో విశేషం కానున్నది.
ఈ క్రమంలోనే కొండపోచమ్మ ముంపు గ్రామాలైన తానేదారుపల్లి, మామిడ్యాల, తానేదారుపల్లి తండాలకు చెందిన 351 కుటుంబాలు ఇండ్లను ఖాళీచేసి తున్కిబొల్లారంలో నిర్మించిన ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో చుట్టాలు, దోస్తుల నడుమ శుక్రవారం సామూహిక గృహప్రవేశాలుచేశాయి.