తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్) ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్పీఆర్ విషయంలో పలు వర్గాల నుండి వ్యక్తమవుతున్న సందేహాలు,అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
దేశ వ్యాప్తంగా ప్రతి పదేండ్లకు ఒకసారి జనగణన చేపడతారు. అందులో భాగంగా ఈసారి 2020-21లో జనగణన జరగాల్సి ఉంది. అంతేకాకుండా ప్రతి ఐదేండ్లకు ఒకసారి ఎన్పీఆర్ సవరణ జరుగుతుంది.
జనగణనకు సన్నాహకంగా హౌస్ హోల్డ్ సర్వే నిర్వహిస్తారు. దాంతోపాటే ఎన్పీఆర్ వివరాలను సేకరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అయితే గతంలో ఉన్న పలు ఎన్పీఆర్ ఫార్మాట్లకు కేంద్ర ప్రభుత్వం మరిన్నీ ప్రశ్నలను జోడించింది. ఇదే పెద్ద సమస్యగా మారింది.