తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత నాలుగేళ్ళుగా బతుకమ్మ పండుగను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరలను అందిస్తూ వస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో రానున్న బతుకమ్మ పండుగను దృష్టిలో ఉంచుకుని బతుకమ్మ చీరల తయారిని ఈసారి రెండు నెలలకు ముందే ప్రారంభించింది.
అయితే గతంలో బతుకమ్మ పండుగకు ఐదు నెలల ముందే ఆర్డర్లు ఇచ్చిన కానీ పంపిణీకి ఆలస్యమవుతుందటంతో ఈఏడాది మాత్రం ఏడు నెలల ముందుగా ఆర్డర్లు ఇవ్వడంతో చీరెల తయారీలో నాణ్యతతోపాటు నిపుణత, సరికొత్త డిజైన్లు ఉండేలా చర్యలు తీసుకొంటున్నది. ఏటా మార్పులు చేర్పులుచేస్తూ పట్టు చీరెలను తలపించేలా నాణ్యమైన నూలును వినియోగిస్తున్నది. ఈసారి గుజరాత్ నుంచి నూలును తెప్పించింది. చెక్స్, లైనింగ్, ప్లెయిన్ చీరెలు రూపుదిద్దుకోనున్నాయి. ఈ కోటి చీరల్లో 6.30 మీటర్ల పొడవైనవి 90 లక్షలు, 9 మీటర్ల పొడవైనవి 10 లక్షలు సిద్ధమవ్వనున్నాయి.
టెక్స్‌టైల్స్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్ననేపథ్యంలో సిరిసిల్ల వస్త్రపరిశ్రమను ఆదుకొనేందుకు మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరువ తీసుకొన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా ప్రభుత్వం నుంచి వస్త్ర తయారీ ఆర్డర్లు ఇప్పిస్తున్నారు. రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ చీరెల తయారీతో ఇక్కడి నేతన్నలకు చేతినిండా పని, శ్రమకు తగ్గ వేతనం లభిస్తున్నది. దీంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం నుంచి గట్టెక్కి అభివృద్ధివైపు పరుగులు పెడుతున్నది. ఈసారి బతుకమ్మ చీరల తయారీకి రూ.317 కోట్ల ఆర్డర్లు ఇవ్వడంతో సిరిసిల్లలోని 18 వేల మరమగ్గాలు, 10 వేల మంది కార్మికులకు ఉపాధి లభించనున్నది.