గత ఐదేళ్ల టీడీపీ హయాంలో అవినీతి రాజ్యమేలిందని, చేసిన తప్పులకు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, టీడీపీ మాజీ మంత్రులు త్వరలోనే జైలుకు వెళ్లక తప్పదని నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా శ్రీశైలం భ్రమరాంబికా, మల్లికార్జున ఆలయాన్ని దర్శించుకున్న రోజా మీడియాతో మాట్లాడుతూ శివయ్య అందరినీ చల్లగా చూస్తారని, జగన్ సారథ్యంలో ఏపీ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ 9 నెలల పాలనలో ఎన్ని సమస్యలు ఎదురైనా సీఎం జగన్ ధైర్యంగా ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే విధంగా జగన్ పాలన ఉందని రోజా చెప్పుకొచ్చారు. దేశం మొత్తం రాష్ట్రంలోని పథకాల వైపు చూస్తున్నారని, వివిధ రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఏపీలో అమలు అవుతున్న అమ్మఒడి, రైతు భరోసా వంటి పథకాలు, 3 రాజధానులు, దిశా యాక్ట్ గురించి తెలుసుకుంటున్నారని రోజా చెప్పారు.
ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, టీడీపీనేతలపై రోజా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ ఇంటిపై జరిగిన ఐటీ సోదాల్లో బయటపడిన 2 వేల కోట్ల కుంభకోణం, ఇటీవల బయటపడిన ఈఎస్‌ఐ స్కామ్‌లపై ఆమె స్పందిస్తూ.. చంద్రబాబు, లోకేష్‌లతో సహా టీడీపీ నేతల బండారం బయటపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, ఇక వారికి జైలే గతి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలన మొత్తం అవినీతిమయమన్న రోజా దోచుకోవడానికి, దాచుకోవడానికి ఆయన ఎలాంటి ఢోకా లేకుండా చేసుకున్నారని ఆరోపించారు. బాబు పాలనలో ఎప్పుడూ ఏడుపేనని ఎద్దేవా చేశారు. తన మాజీ పర్సనల్ సెక్రెటరీ శ్రీనివాస్ రావు ఇంటి మీద, ఆయన ఆఫీసుల మీద ఐటీ దాడులు జరిగి…2 వేల కోట్ల మేర అవినీతి బయట పడితే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని రోజా ప్రశ్నించారు. గత ఐదేళ్ల టీడీపీ హయాంలో రాష్ట్రాన్ని 3 లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పుల పాలు చేశారని, చేసిన అవినీతికి చంద్రబాబు, లోకేష్, ఆయన కేబినెట్‌లో పనిచేసిన వారంతా కచ్చితంగా త్వరలోనే జైలుకి వెళ్తారని రోజా జోస్యం చెప్పారు. ఇప్పటికే అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్, రూ. 2 వేల కోట్ల స్కామ్, వేలాది కోట్ల హవాలా, మనీలాండరింగ్, 300 కోట్ల ఈఎస్‌ఐ కుంభకోణాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రులపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారంతా జైలుకు వెళ్లకతప్పదని వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి.