ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏర్పాటు చేసిన విందుకు హాజరు కాని విషయం తెల్సిందే. అయితే జగన్ ఆర్థిక నేరస్తుడు కాబట్టి ఆహ్వానం అందలేదని ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించిన సంగతి విదితమే.
ఈ ఆరోపణలపై మంత్రి,వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. ఆయన మాట్లాడుతూ మొత్తం దేశంలో బలమైన నాయకత్వాలెవరికీ ఆహ్వానం అందలేదని అన్నారు. అందులో భాగంగానే సీఎం జగన్‌కు కూడా ఆహ్వానం అందలేదని భావిస్తున్నామని ఆయన తెలిపారు.
ఒడిశా ముఖ్యమంత్రి ‘నవీన్ పట్నాయక్ నాలుగోసారి ముఖ్యమంత్రి కదా! మరి ఆయన్ను ఎందుకు పిలవలేదు? మమతా బెనర్జీని ఎందుకు పిలవలేదు? చంద్రబాబు విమర్శలకు అర్థం పర్థం లేదు. తానొక్కడినే తెలివైనవాడిని.. ప్రజలంతా అమాయకులని అనుకుంటున్నారు..’ అని ఆయన ఎద్దేవా చేశారు.