“అభయ హస్తం” పథకాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షించారు. ఈ పథకం కింద అందుతున్న పెన్షన్ల తీరు తెన్నులను ఆయన పరిశీలించారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఆశాఖ ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. అభయ హస్తం పథకంలో పెన్షన్లు రాని అర్హులైన వాళ్ళందరికీ ఆసరా పథకం కింద పెన్షన్లు అందచేయాలని అధికారులని ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆసరా పెన్షన్ల పథకాన్ని అమలులోకి తెచ్చారని, పెన్షన్ల మొత్తాన్ని కూడా 2,016 రూపాయలకు పెంచారని చెప్పారు. అలాగే కేవలం వృద్ధులకే కాకుండా, బీడీ కార్మికులకు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులకు కూడా పెన్షన్లు అందేలా పెద్ద మనసుతో సిఎంగారు సమాజం మీద బాధ్యతతో వ్యవహరిస్తున్నారన్నారు. అయితే, ఈ పథకం డబ్బుల పెంచడమేగాక, అనేక మందికి పెన్షన్లు అందిస్తుండటంతో, అభయ హస్తం పెన్షన్ దారులు ఆసరాలో కవర్ అవుతూవస్తున్నారని చెప్పారు. 2009లో అభయహస్తం పథకం ప్రారంభమైనప్పుడు 21లక్షల మంది అభయ హస్తం పెన్షన్ దారులుండగా, తాజా లెక్కల ప్రకారం అందులో లక్షా 90వేల మంది కి ఆసరా పెన్షన్లు రావడం లేదని తేలిందన్నారు. ప్రస్తుతం పెన్షన్ల అర్హత వయసుని 65 ఏళ్ళ నుంచి 57ఏళ్ళకు తగ్గిస్తుండటంతో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. అందుకే అభయహస్తం పథకం పెన్షనర్ల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించాలని అధికారులకు ఆదేశించారు. అభయహస్తంలో రాకుండా, ఆసరా పెన్షన్లూ అందకుండాపోతున్నవాళ్ళని గుర్తించి, అర్హతలను పరిశీలించి, అందరికీ పెన్షన్లు అందేలా చూడాలని మంత్రి దయాకర్ రావు అధికారులకు సూచించారు. ఈ ప్రక్రియని సాథ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
మరోవైపు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ ఎంజిఎన్ ఆర్ ఇ జి ఎస్)పథకం కింద పారిశుద్ధ్య పనులు చేపట్టడానికి గల అవకాశాలను పరిశీలించాలని మంత్రి దయాకర్ రావు అధికారులకు చెప్పారు. ఈ మధ్య నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమాల్లో అనేక గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య సమస్యలు కనిపించాయన్నారు. ముఖ్యంగా మురుగునీటి కాలువలను శుభ్రం చేయడం సమస్యగా మారిందన్నారు. అందుకే ఉపాధి హామీ పథకంలో భాగంగా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు. ఇక ఇదే పథకం కింద ఇప్పటి వరకు చేపట్టిన వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు పూర్తిగా నిర్మాణం జరిగేట్లు చూడాలన్నారు. అలాగే హరితహారం కింద సాధ్యమైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలని, ఎండాకాలం మొదలైనందున వాటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని, వీటికి పోగా, మిగిలిన మెటీరియల్ కాంపొనెంట్ నిధులతో సిసి రోడ్ల పనులు చేపట్టాలని అధికారులకు చెప్పారు.ఈ సమీక్ష సమావేశంలో మంత్రి దయాకర్ రావుతోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉపాధి హామీ ప్రత్యేక కమిషనర్ సైదులు, ఇఎన్ సి సత్యనారాయణరెడ్డి, సిఇ రవిందర్ తదితరులు పాల్గొన్నారు.