టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటన తీవ్ర ఉద్రికత్తలకు దారి తీస్తోంది. విశాఖలో రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకంగా గత రెండు నెలలుగా చంద్రబాబు చేస్తున్న కుట్రలపై ఉత్తరాంధ్ర ప్రజలు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనను అధికార వైసీపీ నేతలతో పాటు పలు ప్రజా సంఘాలు, మేధావులు, వివిధ వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాగా విశాఖలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు పెందుర్తిలో ప్రభుత్వం చేస్తున్న భూసేకరణను టీడీపీ రాజకీయం చేస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖలో అడుగుపెట్టిన చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. ఎయిర్‌పోర్ట్ వద్ద చంద్రబాబు కాన్వాయ్‌ను చుట్టుముట్టిన నిరసనకారులు ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అయితే వారిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఆగ్రహించిన కొంతమంది ఆందోళనకారులు చంద్రబాబు కాన్వాయ్‌పై కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులతో విరుచుకు పడ్డారు. ఇక మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వాహనాన్ని కూడా స్థానికులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఎయిర్‌పోర్టు, ఎన్‌ఏడీ జంక్షన్ల వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. ఎయిర్‌పోర్టులోకి పరిమిత సంఖ్యలో టీడీపీ నేతలకు అనుమతి ఇచ్చారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు
అలాగే విశాఖ జిల్లా పెందుర్తి మండలం పినగాడిలో కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా గ్రామస్తులు నిరసన తెలిపారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు భారీసంఖ్యలో గ్రామస్తులు సిద్ధమయ్యారు. కాగా గత రెండు నెలలుగా వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ఎల్లోమీడియాతో కలిసి పలు అసత్యకథనాలతో విశాఖపై విషం కక్కుతున్న చంద్రబాబుపై ఉత్తరాంధ్ర ప్రజలు మండిపడుతున్నారు. అందుకే పెందుర్తిలో భూసమీకరణను అడ్డం పెట్టుకుని రాజకీయం చేద్దామని విశాఖలో అడుగుపెట్టిన చంద్రబాబుకు కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులతో సమాధానం చెబుతున్నారు. ఉత్తరాంధ్ర ద్రోహి అయిన చంద్రబాబును తమ ప్రాంతంలో అడుగుపెట్టనిచ్చేది లేదని…తేల్చిచెబుతున్నారు. మొత్తంగా చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.