ఏపీలో ఉగాది రోజున పేదలకు 25 లక్షల ఇండ్ల పట్టాలు అందిస్తామని జగన్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు ప్రభుత్వ భూములను క్రమబద్దీకరించడంతోపాటు, భూకబ్జాలను గుర్తించి స్వాధీనం చేసుకుంటోంది..మరోవైపు భూసమీకరణ జరుపుతోంది. ముఖ్యంగా విశాఖలో 6000 ఎకరాల ల్యాండ్‌పూలింగ్‌కు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం..భూ సేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ల్యాండ్ పూలింగ్‌పై విశాఖ వస్తానని చంద్రబాబు ప్రకటించాడు. కాగా ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై టీడీపీ చేస్తున్న విమర్శలపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్టణంలో ల్యాండ్ పూలింగ్ నిబంధనల మేరకు జరుగుతోందని, ఇది కేవలం పేదల కోసం మాత్రమేనని.. టీడీపీలా దోచుకోడానికి కాదని మంత్రి బొత్స స్పష్టం చేశారు. మీకు లాగా మీ బినామీల కోసం ల్యాండ్ పూలింగ్ చేయడం లేదని..పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చేందుకు ల్యాండ్ పూలింగ్ చేస్తున్నామని కౌంటర్ ఇచ్చారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని బొత్స ఫైర్ అయ్యారు. భూ సేకరణలో ప్రజలు అసంతృప్తిగా ఉంటే వీలైతే ఓ రూపాయి ఎక్కువైనా ఇచ్చి వారిని సంతృప్తి పరచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా చెప్పినట్లు మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబుపై మంత్రి బొత్స తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాబు.. ఎప్పుడూ ప్రగల్బాలు పలకడమేనా.. పనిచేయడం ఏమైనా ఉందా అంటూ చంద్రబాబుపై చురకలంటించారు. చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్ర పేరుతో ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన అవసరం లేదని అన్నారు. రాష్ట్ర ప్రజల్లో చైతన్యం ఉంది కాబట్టే చంద్రబాబును చిత్తుగా ఓడించి వైఎస్ జగన్ ముఖ్యమత్రిగా గెలిపించారని ఎద్దేవా చేశారు. టీడీపీ ల్యాండ్ పూలింగ్‌పై విశాఖకు చంద్రబాబు, జిల్లాకు వస్తే టీడీపీ నాయకులు ఎలా దోచుకున్నారో ప్రజలు చెబుతారని కౌంటర్ ఇచ్చారు. విశాఖ జిల్లాలో బాబు పర్యటన తర్వాత టీడీపీకి ఉన్న కాస్త గౌరవం, విశ్వాసం కూడా పోవడం ఖాయమని, ఉన్న ఒకటో అర సీట్లు కూడా జారిపోతాయని తేల్చి చెప్పారు. మోసం చేయడంలో, మాయమాటలు చెప్పడంలో, మేనెజ్‌మెంట్ నడపడంలో చంద్రబాబు ఆరితేరిన సంగతి తెలిసిందేనని ప్రజలందరికీ తెలిసిందేనని తీవ్ర విమర్శలు చేశారు. మొత్తంగా ఇళ్ల పట్టాల పంపిణీపై రాజకీయం చేస్తున్న చంద్రబాబుపై మంత్రి బొత్స ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.