పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు భువనగిరి మున్సిపాలిటీ పాలకవర్గం సమావేశానికి హాజరయ్యారు.
భువనగిరిలో పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతున్న తీరుపైన అధికారులను పాలకవర్గ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రానున్న నాలుగు సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు లేనందున పార్టీలకతీతంగా అందరూ కలిసి సమన్వయంతో పట్టణ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని మంత్రి కోరారు. భువనగిరి పట్టణ సమగ్రాభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలను చేపట్టాలని ఈ సందర్భంగా పాలకవర్గానికి మంత్రి సూచించారు. జిల్లాలో ఉన్న మునిసిపాలిటీలకు ఎన్నికైన నూతన ప్రజాప్రతినిధులకు తెలంగాణ నూతన మున్సిపాలిటీ చట్టం పైన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.
పట్టణంలోని పారిశుద్ధ్య, హరిత కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణ పరిధిలో ఉన్న అక్రమ లేఅవుట్ల పైన కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
పట్టణంలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రాథమికంగా వార్డు పారిశుద్ధ్య ప్రణాళిక, పట్టణ హరిత ప్రణాళిక, పట్టణ వాటర్ ఆడిట్ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య ప్రణాళికలో భాగంగా పట్టణానికి అవసరమైన స్వచ్ఛ వాహనాలు, పారిశుద్ధ్య సిబ్బంది, డంప్ యార్డ్ అభివృద్ధి,తడి పొడి చెత్త కార్యక్రమాన్ని అమలు పరిచేందుకు తీసుకోవలసిన చర్యలు వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు.
పట్టణ హరిత ప్రణాళికను తయారు చేసి ఇందుకోసం పట్టణ బడ్జెట్లో నుంచి పది శాతం ఖచ్చితంగా ఖర్చు చేయాలని, ఈ ప్రణాళికలో భాగంగా నర్సరీ ఏర్పాటు, మొక్కల పెంపకం పకడ్బందీగా అమలయ్యేలా చూడాలన్నారు. పట్టణంలో పెద్ద ఎత్తున టాయిలెట్ల నిర్మాణం చేయాలని ఒకటి రెండు నెలల లోపే వీటి నిర్మాణం పూర్తయ్యేలా ప్రయత్నం చేయాలన్నారు.
పట్టణంలోని చిరు వ్యాపారుల కోసం వెండింగ్ లను ఏర్పాటు చేయాలని అలాగే పట్టణంలో ప్రస్తుతం ఉన్న స్మశానవాటికలను అభివృద్ధి చేసేందుకు మునిసిపాలిటీ వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో భాగంగా పలువురు పాలకవర్గ సభ్యులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పైన తగిన చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులను, జిల్లా కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు
కేవలం నిధులు అడగడమే కాకుండా నూతన పురపాలక చట్టంలో పేర్కొన్న తమ బాధ్యతలను సైతం ఖచ్చితంగా నిర్వర్తించాలని పట్టణంలో గణనీయమైన మార్పుకు కృషి చేయాలని ఈ సందర్భంగా పాలక వర్గ సభ్యులకు సూచించారు. కౌన్సిలర్లు తమ బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తిస్తే పట్టణానికి అవసరమైన నిధులను ఇచ్చేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు. మళ్లీ రెండు నెలల్లో తిరిగి భువనగిరి పట్టణ సందర్శనకు వస్తానని మంత్రి కేటీఆర్ తెలిపారు