అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్ శివారులో సారంగాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కును ఆర్ అండ్ బీ, గృహ నిర్మాణ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ… ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంపొందించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అడవుల సంరక్షణకు అధిక ప్రాధన్యతనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 33 శాతం పచ్చదనం హరితహారం ద్వారా సాధించటమే లక్ష్యంగా అటవీ శాఖతో పాటు ఇతర శాఖలు పనిచేస్తున్నాయన్నారు. అందులో భాగంగానే సీయం కేసీఆర్ తెలంగాణకు హరితహారం అనే మహోత్తర కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. నగరాలు, పట్టణాలు కాలుష్యంతో నిండిపోతున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణలో అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ముందు చూపుతో అటవీ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని వెల్లడించారు. ఆయా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న అటవీ బ్లాకులను గుర్తించి, అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా అభివృద్ది చేస్తోందని చెప్పారు. కాంక్రీట్ జంగిల్స్ లాగా మారిన సిటీల్లో వాతావరణాన్ని చల్లబరిచేందుకు, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు, గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా రూ. 500 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 94 పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణ యించగా, ఇప్పటికే 32 పార్కులు ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. నిజామాబాద్ ను మరింత ఉన్నత జీవన ప్రమాణాలు ఉన్న నగరంగా మార్చాలన్న లక్ష్యంగా సారంగాపూర్ లో అర్బన్ ఫారెస్ట్ పార్క్ చేశామని తెలిపారు. అర్బన్ ఫారెస్ట్ పార్కును 105 హెక్టార్లలో రూ.3.37 కోట్ల వ్యయంతో సర్వాంగ సుందరంగా రూపొందించారన్నారు.
ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ ఆర్. శోభ, ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, కలెక్టర్ నారాయణ రెడ్డి, మేయర్ దండు నీతు శేఖర్, జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు, అడిషనల్ పీసీసీఎఫ్ వినయ్ కుమార్, ఎఫ్ డీవో రాంకిషన్ రావు, డీఎఫ్ వో సునీల్ ఎస్ హిరామత్, తదితరులు పాల్గొన్నారు.