గత నాలుగేళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వం చేసిన ఆర్ధిక లావాదేవీలు, కీలక విధానాలు, నిర్ణయాలు, ప్రాజెక్టులు, భూముల లావాదేవీలపై విచారణ, ఇన్సైడర్ ట్రేడింగ్‌పై దర్యాప్తు కోసం తాజాగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు రాష్ట్ర ప్రభుత్వం ఓ పోలీసు స్టేషన్ హోదాను కల్పించింది. సీఆర్పీసీలోని సెక్షన్2ను అనుసరించి కేసుల నమోదు, దర్యాప్తు వంటి విస్తృత అధికారాలను సైతం ప్రభుత్వం వారికి కట్టబెట్టింది. దీనికి రాష్ట్రం మొత్తం పరిధి కల్పించింది. ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీచేసింది. దీనికి మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి అందించిన నివేదికలో పేర్కొన్న అవకతవకలపైన సిట్ దర్యాప్తు చేయనుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన దర్యాప్తు సంస్థలతో సంప్రదింపులు, సమన్వయం చేసుకునే నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. దర్యాప్తుచేస్తున్న అంశాలకు సంబంధించి ఏ వ్యక్తినైనా, అధికారినైనా విచారణకు పిలిపించే, వారి వాంగ్మూలాల్ని నమోదు చేసుకునే అధికారాన్ని సిట్‌కు ఏపీ ప్రభుత్వం కల్పించింది. దర్యాప్తు చేస్తున్న అంశాలు, భూముల లావాదేవీలకు సంబంధించిన దస్త్రాలు, లావాదేవీలను పరిశీలించే అధికారాన్నీ సిట్‌కు ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను వెలికితీసి అవసరమైన మేర చర్యలు తీసుకునేలా వీళ్లు పనిచేస్తారు. అలాగే అవసరం అయినపుడు ఎవరినైనా విచారించి అదుపులోకి తీసుకుంటారు.