రాష్ట్రంలో అన్నిరకాల ఎన్నికలు ముగిశాయి.. వచ్చే నాలుగేండ్లపాటు ఎలాంటి ఎన్నికలు లేవు.. ఇక మా దృష్టంతా అభివృద్ధిపైనే’ అని ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. పార్టీలకతీతంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. బాగా పనిచేసి ప్రజల మనసులు గెలుచుకోవడమే ప్రధాన ఉద్దేశమని.. తమకెలాంటి రాజకీయ ఉద్దేశాలు, ఆపేక్షలు లేవని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పట్టణప్రగతి’ కార్యక్రమం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నిర్వహించిన పట్టణపగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులోభాగంగా పురపాలకశాఖమంత్రి కేటీఆర్.. ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మహబూబ్‌నగర్‌లో పట్టణప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలో దళితులు అధికంగా ఉండే పాతతోట ప్రాంతంలో పాదయాత్రచేశారు.
అనంతరం అప్పన్నపల్లిలోని వైట్‌హౌజ్ ఫంక్షన్ హాల్‌లో మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు కమిటీ సభ్యులు, ప్రత్యేక అధికారులతో ఏర్పాటుచేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌లో పట్టణప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. మొత్తం 130 మున్సిపాలిటీల్లో 122 చోట్ల టీఆర్‌ఎస్ పాలకవర్గాలే ఉన్నాయని.. అయినప్పటికీ పార్టీలకతీతంగా అన్ని మున్సిపాలిటీల అభివృద్ధే తమ అజెండా అని స్పష్టంచేశారు. బల్దియా అంటే ఖాయా.. పీయా.. చల్దియా కాదని నిరూపించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గంటలకొద్దీ కసరత్తుచేసి కొత్త మున్సిపల్ చట్టం తీసుకొచ్చారని చెప్పారు. కొత్త చట్టం ద్వారా పట్టణాల రూపురేఖలు మార్చేందుకు అవకాశం వచ్చిందని, ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
ఎక్కువ సమస్యలుండే ప్రాంతాలను గుర్తించి అక్కడినుంచే పట్టణప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం సూచించారని.. అందుకే మహబూబ్‌నగర్‌లో దళితులు ఎక్కువగా ఉండే పాతతోటలో పాదయాత్ర చేసినట్టు మంత్రి కేటీఆర్ వివరించారు. ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, మహిళలతో మాట్లాడి వారి సమస్యలను గుర్తించానని.. వాటిని ప్రాధాన్యక్రమంలో తీరుస్తామని తెలిపారు. ప్రభుత్వం పేదలకోసం ఏం చేస్తున్నదో వివరించానని.. ఇంటింటికీ శుద్ధజలం అందించడం, పింఛన్లు, డబుల్ బెడ్‌రూం ఇండ్లు తదితర అంశాల్లో వారు సంతోషంగా ఉన్నారన్నారు. ఒక్క పాతతోటలోనే 90 డబుల్ బెడ్‌రూం ఇండ్లను ఇచ్చినట్టు వెల్లడించారు.
మహబూబ్‌నగర్‌లో గతంలో 14 రోజులకోసారి తాగునీరు సరఫరా అయ్యేదని.. తెలంగాణ ప్రభుత్వం వచ్చా క ప్రస్తుతం నిత్యం శుద్ధమైన జలం అందిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. జీహెచ్‌ఎంసీలో ప్రవేశపెట్టిన పరిచయం కార్యక్రమం ద్వారా పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందితో ప్రజలకు నేరుగా పరిచయమయ్యేలా చూశామన్నారు. ప్రజలు, సిబ్బంది మధ్య చక్కని సంబంధాలు ఉండటం వల్ల పారిశుద్ధ్య నిర్వహణ మరింతగా విజయవంతమైందని చెప్పారు. రాష్ట్రమంతా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కృషిచేస్తామని చెప్పారు. సిరిసిల్లలో చెత్త ద్వారా విద్యుత్, ఎరువులను తయారుచేస్తూ నెలకు రూ.3 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నారని.. అంతకంటే పెద్దదైన మహబూబ్‌నగర్‌లో తడిచెత్త ద్వారా ఎరువులు, పొడిచెత్త ద్వారా విద్యుత్ తయారుచేసేందుకు అవకాశం ఉన్నదని చెప్పారు.