ఒకటో తరగతి చదువుతున్న అభం శుభం తెలియని చిన్నారిపై అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన కిరాతకుడికి న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. చిత్తూరు నగరంలోని పోక్సో (లైంగిక దాడుల నుంచి చిన్న పిల్లల పరిరక్షణ) న్యాయస్థానం పూర్తి అదనపు ఇన్‌చార్జి న్యాయమూర్తి, మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ఎం.వెంకట హరినాథ్ సోమవారం ఈ మేరకు తీర్పునిచ్చారు. రాష్ట్రంలో పోక్సో చట్టం కింద ఉరిశిక్ష ఇదే తొలిసారి కావడం గమనార్హం. కేసు వివరాలను ప్రత్యేక అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.లోకనాథరెడ్డి, మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి విలేకరులకు వివరించారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన ఐదేళ్ల చిన్నారి గతేడాది నవంబర్ 7వ తేదీ రాత్రి కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీలో జరిగిన ఓ వివాహానికి తల్లిదండ్రులతో కలసి వచ్చింది. అందరూ భోజనాలు చేసిన తర్వాత ఆడుకుంటూ ఒంటరిగా కన్పించిన బాలికపై మదనపల్లెలోని బసినికొండకు చెందిన మహ్మద్ రఫీ (25) కన్ను పడింది.
లారీడ్రైవర్ అయిన రఫీ ఆమెకు ఐస్‌క్రీమ్ ఆశ చూపించి కల్యాణమండపంలో ఉన్న బాత్‌రూమ్‌కు తీసుకెళ్లాడు. పాప అరవకుండా గట్టిగా నోరు మూసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత చిన్నారనే కనికరం కూడా లేకుండా గొంతునులిమి చంపేశాడు. మృతదేహం కన్పించకుండా కల్యాణ మండపం పక్కన పడేసి వెళ్లిపోయాడు. రాత్రంతా పాప కోసం గాలించిన తల్లిదండ్రులు మరుసటిరోజు తెల్లవారుజామున పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు కల్యాణ మండపం ప్రహరీ పక్కనున్న ఓ గుంతలో పాప మృతదేహం లభించింది. అక్కడి సీసీ కెమెరాల్లో ఉన్న ఫుటేజీల ఆధారంగా నిందితుడి ఊహాచిత్రాన్ని రూపొందించి సమీప ప్రాంతాల్లోని ప్రజలను విచారించగా రఫీ ఘాతుకం బట్టబయలయ్యింది. ఎస్పీ సెంథిల్‌కుమార్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం పరారీలో ఉన్న రఫీని పట్టుకుంది. నవంబర్ 16వ తేదీన పోలీసులు అతన్ని అరెస్టు చేసి మదనపల్లె జూనియర్ మునిసిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచారు. రఫీ తన 15వ ఏటే ఓ బాలికపై అత్యాచారయత్నం చేశాడని, ఆ కేసుకు సంబంధించి కొన్నాళ్లు జువైనల్ హోమ్‌లో కూడా ఉన్నట్లు విచారణలో గుర్తించారు.