ఆంధ్రప్రదేశ్ వరదాయినిగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణపనుల్లో మళ్లీ జోరందుకుంది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు రాష్ట్రంలో సస్యశ్యామలం చేసే బహుళార్థసాధక ప్రాజెక్టు ఇది. వరద ప్రవాహంతో పొంగిపొర్లే గోదావరి నదిలో పోలవరం కారణంగా ఇప్పుడు శ్రమైక సౌందర్యం వెల్లివిరుస్తోంది. చకచకా సాగుతున్న పనుల శబ్ధాలు, వాహనాల ధ్వనులు గోదావరి సవ్వడికి మరిన్ని వన్నెలు సమకూర్చుతున్నాయి. ఇంజినీరింగ్ రంగంలో మూడు దశాబ్దాల అపార అనుభవం, సంక్లిష్టమైన ప్రాజెక్టులు చేపట్టడంలో నైపుణ్యం, సకాలంలో పనులు పూర్తి చేయగల సమర్థులైన సిబ్బంది కలబోతైన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు పనులు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు తీర్చేలా వేగవంతంగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎంఈఐఎల్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇంజినీరింగ్ అద్భుతాలకు మచ్చుతునకలుగా నిలిచే కాళేశ్వరం, హంద్రీ-నీవా, పట్టిసీమ వంటి ముఖ్యమైన ప్రాజెక్టులను గడువు కంటే ముందే పూర్తిచేసిన ఎంఈఐఎల్, పోలవరం పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ ప్రాజెక్టును కూడా నిర్దేశించిన గడువులోపు పూర్తిచేసి ఇంజినీరింగ్రంగంలో తనకున్నా సమర్ధతను మరోసారి చాటి చెప్పేందుకు సిద్ధమవుతోంది.పుష్కరకాలంగా నత్తకు నడకలు నేర్పుతున్నట్టు సాగిన పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఇప్పుడు వేగంగా పెరిగింది. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన కాంక్రీట్ పనులను ఏడెనిమిది నెలల్లో పూర్తి చేసేలా ఎంఈఐఎల్ కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్తోంది. రికార్డు స్థాయిలో 3.07 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీట్ వేసేందుకు నిత్యం ఐదు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారికి తోడుగా అత్యాధునిక యంత్రాలు ఉండనే ఉన్నాయి. వీటిన్నింటికి అదనంగా అత్యున్నత స్థాయిలో అనునిత్యం పనుల పర్యవేక్షణ జరుగుతోంది. పనుల వేగం పెరగడం, గడువును నిర్దేశించుకోవడంతో ఈ నెల 27న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.ప్రభుత్వాన్ని రూ.628 కోట్లు మిగిల్చే రీతిలో పోలవరం ప్రాజెక్టు పనులను ఎంఈఐఎల్ రివర్స్ టెండరింగ్ విధానంలో దక్కించుకుంది. నవంబర్లోనే పనులు ప్రారంభించినప్పటికీ పనుల్లో వేగం పుంజుకోలేదు. దీనికి కారణం గతంలో చేపట్టిన పనులు ఇంజినీరింగ్ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం. దానికి తోడూ ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని రీతిలో గోదావరికి భారీ వరదలు వచ్చాయి. వరద కూడా ఎక్కువ రోజులు కొనసాగింది. గత ప్రభుత్వం అనాలోచితంగా ముందు కాఫర్ డ్యామ్ నిర్మించడంతో స్పిల్ వే ప్రాంతం వరద ముంపునకు గురైంది. అంతే కాదు దాదాపు 4 టీఎంసీల వరద నీరు నిర్మాణ ప్రాంతంలోకి వచ్చి చేరింది. ముంపు కారణంగా రహదారులు నిరుపయోగంగా మారాయి. ముంపు సమస్య నుంచి బయటపడి, మళ్లీ కొత్తగా రహదారులు నిర్మించుకొని, తగిన పని ప్రదేశాన్ని రూపొందించుకోవడానికి ఎంఈఐఎల్కు దాదాపు మూడు మాసాల సమయం పట్టింది. దీనికంతటికి కారణం అప్పటి ప్రభుత్వం ముందు చూపులేకుండా కాఫర్ డ్యామ్ నిర్మించడమేనని ఇంజినీరింగ్ నిపుణులు చెప్తున్నారు.
పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే జలాశయంలో ప్రధానమైన స్పిల్ వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్లోపు పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎంఈఐఎల్ స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాయి. స్పిల్ వేలో 53 బ్లాకులు నిర్మించాలి. ఒక్కొక్క బ్లాకులో 55 మీటర్ల ఎత్తుండే స్పిల్ వే పియర్స్ ఉంటాయి. ఒక బ్లాకులో ఒక మీటరు ఎత్తు నిర్మించేందుకు నాలుగు రోజులు పడుతుంది. మొత్తం స్పిల్ వే కోసం 2.5 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయాలి. పనులు చేపట్టిన సమయంలో అవాంతరాలు ఎదురైనా జనవరి చివరినాటికి ఎంఈఐఎల్ 25,000 క్యూబిక్ మీటర్లు పూర్తి చేసింది. ఈ నెలలో 40 వేల క్యూబిక్ మీటర్లు పూర్తి చేసేలా పనులు వేగంగా సాగుతున్నాయి. ఏప్రిల్-జూన్ మూడు నెలల సమయంలో 2.05 క్యూబిక్ మీటర్ల పనులు నిర్వహించేలా ఎంఈఐఎల్ కార్యాచరణ రూపొందించింది. ఎత్తు పెరిగే కొద్ది పనులు సంక్లిష్టంగా మారుతుంటాయి. వాటిని అధిగమించేందుకు ఆధునిక యంత్రసామాగ్రి సమకూర్చుకొని లక్ష్యాన్ని సాధించేందుకు ఎంఈఐఎల్ ముందుకు సాగుతోంది.
దక్షిణ భారతదేశంలో అత్యధిక వరద ప్రవాహం ఉండే నదుల్లో గోదావరి ఒకటి. ఏటా దాదాపు 3000 టీఎంసీల నీరు సముద్రంలో వృధాగా కలిసిపోతుంది. ఇందులో స్వల్పమొత్తాన్ని ఒడిసిపట్టుకుంటే చాలు ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజల కష్టాలు తీరుతాయి. అందుకే పోలవరం ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా మారింది. పోలవరం రిజర్వాయర్ 75.2 టీఎంసీల నీటిని నిల్వ చేయగలదు. మొత్తంగా 194 టీఎంసీల నీటిని నిలిపి ఉంచే సామర్ధ్యం దీని సొంతం. దీని ద్వారా కొత్తగా 7.2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందడంతో పాటు 23 లక్షల ఎకరాలకు సాగునీటిని స్థిరీకరించవచ్చు. అంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆంధప్రదేశ్ రాష్ట్రం మొత్తం పోలవరం ప్రాజెక్టుతో ప్రయోజనం పొందుతుంది. అలాగే కృష్ణా నదికి 80 టీఎంసీల నీటిని గోదావరి నుంచి మళ్లించేందుకు వీలు కలుగుతుంది. విశాఖపట్నం నగరపు తాగునీటి అవసరాలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సహ చుట్టుపక్కల పరిశ్రమలకు నీటి కొరత తీరుతుంది. ఈ కాలువలు ప్రయాణించే మార్గంలో ఉండే 540 గ్రామాలకు చెందిన 29 లక్షల జనాభాకు తాగునీటి సదుపాయం అందుబాటులోకి వస్తుంది. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు పొరుగునున్న ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాలు కూడా ప్రయోజనం పొందనున్నాయి. ఒడిషాకు 5 టీఎంసీలు, ఛత్తీస్గఢ్ 1.5 టీఎంసీల నీరు అందుతుంది. తమ ప్రాంతాల్లో చేపల పెంపకం, బోటింగ్ సదుపాయాల వంటివి ఈ రాష్ట్రాలు చేపట్టి లబ్ది పొందగలవు. ప్రపంచంలో అతి పెద్దదిగా చెప్పే చైనాలోని త్రీ గార్జెస్ డ్యామ్ డిశ్చార్జ్ సామర్ధ్యం 47 లక్షల క్యూసెక్కులు. పోలవరం స్పిల్ వేను 50 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జ్ సామర్ద్యంతో నిర్మిస్తున్నారు. అంటే త్రీ గార్జెస్ కంటే 3 లక్షల క్యూసెక్కుల అధిక సామర్ధ్యం కలిగినది. 1000 ఏళ్లకు ఒకసారి వచ్చే అతి భారీ వరదలను సైతం తట్టుకునేలా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాగుతోంది. జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన పోలవరం బహుళార్థ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు అవసరం. కరువును శాశ్వతంగా తొలగించి ఆంధ్రప్రదేశ్ మోము నుంచి పేదరికాన్నినిర్మూలిస్తుంది. ప్రాజెక్టు పూర్తైతే “అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్” అనే పేరు తిరిగి రాష్ట్రానికి వస్తుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు.
Tags andrapradesh polvaram ys jagan