రాష్ట్రంలోని గ్రామ,పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థలను పటిష్టవంతంగా పనిచేసేలా తగిన చర్యలు తీసోకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అమరావతి సచివాలయంలో గ్రామ,వార్డు సచివాలయాలకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రజల ముగింటకే ప్రభుత్వ పాలన అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రజలకు సకాలంలో మెరుగైన సేవలు అందించేందుకు సంబంధిత శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.గ్రామ,వార్డు సచివాలయాల్లో వివిధ శాఖల విధులకు సంబంధించి నియమితులైన సిబ్బంది వారికి కేటాయించిన విధులను సక్రంగా నిర్వహించుట ద్వారా ప్రజలకు మెరుగైన రీతిలో సేవలందించే విధంగా చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.
గ్రామ,వార్డు సచివాలయాలకు సంబంధించి సిబ్బంది జాబ్ చార్ట్,విధులు తదితర అంశాలకు సంబంధించి ఇంకా కొన్ని అంశాల్లో స్పష్టత రావాల్సి ఉన్నందున వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పంచాయితీరాజ్,మున్సిపల్ పరిపాలన తదితర శాఖల అధికారులు కూర్చుని చర్చించి పరిష్కరించుకోవాలని సిఎస్ నీలం సాహ్ని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ విభాగం ప్రత్యేక కమీషనర్ కన్నబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థలు ద్వారా సుమారు 28 విభాగాలకు సంబంధించి 541 వివిధ రకాల సర్వీసులను ప్రజలకు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. సచివాలయాల్లో స్పందన కార్యక్రమం సక్రమంగా జరుగుతోందని, గ్రామ ప్రాంతాల్లో విలేజ్ వాలంటీర్ల క్లస్టర్లతో వాటి పరిధిలోని గృహాల మ్యాపింగ్ చేసే ప్రక్రియ ఇప్పటికే 85శాతం పూర్తయిందని పేర్కొన్నారు.అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ ప్రకియ వేగవంతంగా జరుగుతున్నట్టు వివరించారు.