ఏపీలో టీడీపీ నేతలు వరుసగా స్కామ్‌ల్లో ఇరుక్కుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, మాజీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులతో సహా పలువురు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ స్కామ్‌లో ఇరుక్కోగా..మాజీ మంత్రులు అచ్చెంనాయుడు, పితాని సత్యనారాయణ ఈఎస్‌ఐ స్కామ్‌లో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఇక టీడీపీ హయాంలో వివిధ ప్రభుత్వ శాఖలలో జరిపిన అవినీతిపై జగన్ సర్కార్ విచారణ జరిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పరిటాల సునీత అవినీతిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అంటున్నారు. చంద్రబాబు సర్కారులో పరిటాల సునీత పౌరసరఫరాల శాఖ మంత్రిగా భారీ అవినీతికి పాల్పడ్డారని అప్పట్లో వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. చంద్రన్న తోఫా..చంద్రన్న సంక్రాంతి కానుక అంటూ మగ్గిపోయిన పప్పు బెల్లాలను ప్రజలకు కట్టబెట్టి టీడీపీ నేతలు కోట్లు దోచుకున్నారని నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఆరోపించింది. అలాగే అన్నా క్యాంటీన్ల నిర్మాణాలలో అడ్డగోలుగా అవినీతి జరిగిందని విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో పౌరసరఫలా శాఖ మంత్రిగా పని చేసిన పరిటాల సునీత కాంట్రాక్టులన్నీ తన బినామీలకే కట్టబెట్టారని వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. జంగాలపల్లిలోని ఎఫ్‌సీఐ గోదాంలను నంద్యాలకు మార్చడంతో ప్రభుత్వానికి రూ. 100 కోట్ల నష్టం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. పరిటాల సునీత సోదరులు, వారి అనుచరులు నామినేషన్ పద్ధతిలో కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులను పొంది కోట్ల రూపాయలను దోచారని ఫైర్ అయ్యారు. సీఐడీ విచారణ జరిపిస్తే ఆమె నిజస్వరూపం మొత్తం బయటపడుతుందని తోపుదుర్తి అన్నారు. త్వరలోనే పరిటాల సునీత ఆధ్వర్యంలో కాంట్రాక్టు వ్యవహారాలు, సివిల్ సప్లైస్ శాఖకు సంబంధించిన అవినీతి వ్యవహారాలను కూడా వెలుగులోకి తీసుకొస్తామని తోపుదుర్తి ప్రకటించారు. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి వ్యాఖ్యలు అనంతపురం జిల్లాల్లో సంచలనంగా మారాయి. మరి వైసీపీ ఎమ్మెల్యే విమర్శలపై పరిటాల సునీత కుటుంబం ఎలా స్పందిస్తుందో చూడాలి.
