సొంత ఇలాకాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా కుప్పం నియోజకవర్గంలోని రాళ్లబుదుగురుకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు కుప్పంలో జరిగే ప్రజా చైతన్య యాత్రలో చంద్రబాబు పాల్గొంటారు. కాగా ఇప్పటికే ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో వైసీపీ టీడీపీ మధ్య కుప్పంలో రగడ జరుగుతోంది. ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో చంద్రబాబును ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేయాలని స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు భావించారు. అయితే కుప్పం పట్టణమంతా వైసీపీ ఫ్లెక్సీలతో నిండిపోయి ఉంది. వారం క్రితం మంత్రి పెద్దిరెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఇంతవరకు తొలగించలేదు. దీంతో ఇరు పార్టీల మధ్య రగడ మొదలైంది. మరోపక్క వైసీపీ నేత విద్యాసాగర్ హత్యకు జరిగిన కుట్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటన కుప్పంలో మరింత వివాదాన్ని రగిలించింది. ఈ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పర్యటిస్తున్న చంద్రబాబు కాన్వాయ్‌ను వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో కుప్పంలో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. 30 ఏళ్లుగా ఎమ్మెల్యేగా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, మూడోసారి ప్రతిపక్షనేతగా ఉంటూ కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమి లేదని వైసీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుపై మండిపడ్డారు. దీంతో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ, తోపులాట చోటుచేసుకుంది. ప్రస్తుతం కుప్పంలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీగా మొహరించి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా సొంత ఇలాకాలో ప్రజా చైతన్యయాత్ర పేరుతో రాజకీయం చేయాలని వచ్చిన చంద్రబాబుకు వైసీపీ కార్యకర్తలు చుక్కలు చూపించారు.
