అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన రోజే అమెరికాలోని లాస్ఏంజెలెస్లో భారతీయ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన కథనంప్రకారం హర్యానాలోని కర్నాల్ కు చెందిన మణిందర్ సింగ్ లాస్ ఏంజెలెస్‌లోని ఒక స్టోర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం ఉదయం 5:30 గంటలకు మణిందర్ స్టోర్‌లో ఉండగా గుర్తు తెలియని దుండగుడు మాస్క్ ధరించి స్టోర్‌లోకి చొరబడ్డాడు.. వెంటనే ఆ సమయంలో ఉన్న ఇద్దరు కస్టమర్లకు ఏ హానీ తలపెట్టని దుండగుడు మణిందర్‌పై మాత్రమే కాల్పులు జరిపాడు. అనంతరం డబ్బులు తీసుకుని అక్కడినుండి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన మణిందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గతనెలలో ఇండియాకు వచ్చిన మణిందర్ కొద్దిరోజులు ఉండి అమెరికాకు వెళ్లిపోయాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. మణిందర్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భారత్ అమెరికా దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పరచడంకోసం ట్రంప్ భారత్ పర్యటనకు వస్తున్న సమయంలోనే ఈ దుర్ఘటన జరగడం నిజంగా బాధాకరం.
