అమరావతి రాజధాని అంశాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ ప్రజా ప్రతినిధులపై దాడులకు పాల్పడటం తెలుగుదేశం పార్టీ నాయకుల చేతకానితనానికి నిదర్శనమని రాష్ట్ర విద్యాశాఖమంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఎంపీ నందిగం సురేష్ పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఉద్దేశపూర్వకంగానే నందిగం సురేష్ పై దాడి జరిగిందని, టీడీపీ అకృత్యాలకు ఇది నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. మొన్న విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై, నిన్న చిలకులూరిపేట ఎమ్మెల్యే వాహనంపై, ఇప్పుడు ఎంపీ సురేష్ పై దాడి చేయటం హేమమైన చర్య అన్నారు.
ప్రజలు గత ఎన్నికల్లో కొట్టిన దెబ్బకు టీడీపీ నాయకులకు మతి భ్రమించి ఏమి చేయలేని స్థితిలో రైతులను అడ్డుపెట్టుకొని టీడీపీ గుండాలను రంగంలోకి దింపి దాడులకు పాల్పడుతోందన్నారు. గతంలో రాజధాని భూములు కొల్లగొట్టేందుకు టీడీపీ చేసిన దుశ్చర్యలకు అప్పట్లో సురేష్ ఎదురు నిలిచిన సంగతి అందరికీ తెలుసునని, దానిని దృష్టిలో పెట్టుకొని టీడీపీ ఉద్దేశపూర్వకంగా ఎంపిపై కొందరు కిరాయి మనుషులతో ఇప్పిటికి రెండుసార్లు దాడికి పాల్పడటం జరిగిందన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు ఇటువంటి చర్యలతో ప్రజాప్రతినిధులను భయపెట్టాలని చూస్తే బెదిరేవాళ్ళు లేరని మంత్రి హెచ్చరించారు.