గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తెలుగుదేశం పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఒకవైపు అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ బయటకు వస్తుండగా సిట్ ఏర్పాటుతో జగన్ సర్కార్ దూకుడు పెంచడంతో టీడీపీకి తలనొప్పులు మొదలయ్యాయి. ఇది నలుగుతూ ఉండగా తాజాగా టీడీపీ మెడకు మరోవివాదం చుట్టుకుంది.. రాజధాని విషయంలో చంద్రబాబు నిబంధనలకు, ఆదేశాలు, చట్టాలను పక్కనపెట్టి తప్పుడు నిర్ణయం తీసుకున్నారని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకునేందుకు చంద్రబాబు నిబంధనలను పాటించలేదని ఏపీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అనిల్ కుమార్ బోరుగడ్డ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను కోర్టుదృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను, రాజధాని ఏర్పాటుపై నియమించిన శివరామకృష్ణ కమిటీ నివేదికను పక్కనపెట్టారని, చంద్రబాబు తన స్వార్థంకోసం రాజధానిని విజయవాడ, గుంటూరుకు మధ్యలో పెట్టారన్నారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.