వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు అనుకుల మీడియా పవిత్రమైన తిరుమల తిరుపతిపై దుష్ప్రచారానికి తెగబడింది. తొలుత ఆర్టీసీ బస్‌టికెట్లపై అన్యమతప్రచారం అని టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారు. అయితే ఆ టికెట్లు చంద్రబాబు హయాంలోనే ముద్రణ అయ్యాయని తేలడంతో సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత శేషాచల కొండల్లో చర్చి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసి టీడీపీకి చెందిన సానుభూతిపరులు అడ్డంగా దొరికిపోయారు. ఆ తర్వాత తిరుమల వెబ్‌సైట్, క్యాలెండర్‌లో యేసు పదం అంటూ చంద్రబాబు అనుకుల మీడియా అసత్య ప్రచారం చేసింది. అయితే టీటీడీ ఈ ప్రచారాన్ని ఖండించింది. తాజాగా టీటీడీపై సోషల్ మీడియాలో మరో దుష్ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఏకంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పేరిట ఓ నకిలీ ట్విటర్ ఖాతా ఓపెన్ చేసి టీటీడీ ప్రతిష్ట మంటగలిపేలా ఓ ట్వీట్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) నుంచి రూ.2300 కోట్లు ఏపీ ఖజానాకు తరలించారని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేరిట ఓ ట్వీట్ సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది. అయితే అది అజిత్ దోవల్‌ది కాదని తేలింది. దీంతో టీటీడీ వర్గాలు ఈ ఘటనపై తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాయి. అజిత్ దోవల్ పేరిట జరుగుతున్న నకిలీ ప్రచారంపై నిగ్గు తేల్చాలని తమ ఫిర్యాదులో కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
కాగా తిరుమల తిరుపతిదేవస్థానంపై అజిత్ దోవల్ పేరుతో జరుగుతున్న దుష్ప్రచారాన్ని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఖండించారు. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడుతూ… టీటీడీకి చెందిన రూ.2,300 కోట్లను ప్రభుత్వ ఖజానాకు బదిలీ చేస్తున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ట్విట్టర్ ఖాతా అజిత్ దోవల్‌ది కాదని, అది ఫేక్ అని తమ పరిశీలనలో తేలిందన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెడతామని..హెచ్చరించారు. ఈ మేరకు త్వరలోనే సైబర్ క్రైం విభాగం ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ నకిలీ ట్వీట్ వెనుక ఎంత పెద్ద వారున్నా ఉపేక్షించేది లేదని వైవి హెచ్చరించారు. మొత్తంగా టీటీడీ ప్రతిష్ట దెబ్బతీసేలా వరుసగా అసత్య ప్రచారం జరగడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం.. టీటీడీ ఈ విషయంపై ఫోకస్ పెట్టి సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత పటిష్టపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.