టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ నేత హత్యకు కుట్ర జరిగిందన్న వార్త సంచలనంగా మారింది. దీంతో బాబు సొంత ఇలాకాలో రాజకీయ కక్షలు రాజుకోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళితే గతంలో టీడీపీలో పని చేసిన విద్యాసాగర్ అనే నేత ఇప్పుడు వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విద్యాసాగర్‌ను హత్య చేసేందుకు కుట్ర జరిగిందన్న వార్త ఇప్పుడు కుప్పంలో కలకలంరేపుతోంది. విద్యా సాగర్ మర్డర్‌కు పక్కా స్కెచ్ వేసిన ప్రత్యర్ధులు పీలేరుకు చెందిన రౌడీషీటర్ గణేష్‌కు సుపారీ ఇచ్చారు. ఈ మేరకు గణేష్ తో విద్యాసాగర్ హత్యకు రూ.10 లక్షలకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా కొంత డబ్బు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే తన హత్యకు కుట్ర జరుగుతుందన్న విషయాన్ని నమ్మకస్తులైన కొందరి ఫోన్‌కాల్ ద్వారా తెలుసుకున్న విద్యాసాగర్ వెంటనే ఆలస్యం చేయకుండా కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విద్యాసాగర్ హత్యకు జరిగిన కుట్రపై దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ మర్డర్ స్కెచ్ వెనుక అసలు కుట్రదారులు ఎవరు అన్న దానిపై విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే ఇక గత ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు మెజార్టీ భారీగా తగ్గిపోవడంలో విద్యాసాగర్ ముఖ్యభూమిక పోషించినట్లు తెలుస్తోంది…రామకుప్పం మండలంలో చంద్రబాబు మెజారిటీని 8,300 నుంచీ 3400కు తగ్గిపోవడంతో విద్యాసాగర్ క్రియాశీలకంగా పని చేశారు. అయితే కుప్పంలో వైసీపీ కీలక నేత విద్యా సాగర్ మర్డర్‌కు కుట్ర చేయడం వెనుక వ్యక్తిగత కారణాలు ఉన్నాయా? లేక రాజకీయ కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తంగా చంద్రబాబు సొంత నియోజకవర్గంలో పక్కాస్కెచ్‌తో వైసీపీ నేత హత్యకు కుట్ర జరగడం ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
